16 April, 2026 | 9:07 AM

మావోయిస్టు చీఫ్‌ను చంపితే నక్సలిజం పోతుందనేది భ్రమే

27-05-2025 12:14 AM

-సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి 

కరీంనగర్ క్రైం , మే 26 (విజయ క్రాంతి): మావోయిస్టు పార్టీ అగ్రనేత, సెంట్రల్ కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావును తుద ముట్టించడం ద్వారా బిజెపి ప్రభుత్వం నక్సలిజం పోతుందని భ్రమ పడడం దురదృష్టకరమని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు.

సోమవారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక వీరుడు మరణిస్తే వేల మంది పుట్టుక వస్తారన్నారు. భూమికోసం భుక్తి కోసం వ్యక్తి చాకిరి విముక్తి కోసం దోపిడీకి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిందే నక్సల్బర్ ఉద్యమం అని, అవి కొనసాగినంత కాలం ఉద్యమం కొనసాగుతుందన్నారు.

బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్టుబడిదారుల కొమ్ముకాస్తుంది అన్నారు. ఆ క్రమంలోనే అటవీ ఖనిజ సంపద కోసం నక్సలిజాన్ని మార్చి 2026నాటికి అంతం చేస్తామని భీష్మించడం సిగ్గుచేటు అన్నారు. ఒక వ్యవస్థ కోసం ఉద్యమిస్తున్న మావోయిస్టు పార్టీని శాంతి, ఆపరేషన్ కగార్ పేరుతో నక్సల్స్ ఎన్కౌంటర్ పేరుతో హత్య చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, కొయ్యడ సృజన్ కుమార్, బోయినీ అశోక్ టేకుమల్ల సమ్మయ్య, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు న్యాలపట్ల రాజు, కిన్నెర మల్లమ్మ కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, బ్రాహ్మణపల్లి యుగేందర్, బోనగిరి మహేందర్,మచ్చ రమేష్, కంది రవీందర్ రెడ్డి, పాల్గొన్నారు