పసిడిని ఆర్బీఐ విదేశాల్లో ఉంచేది ఎందుకు!?
యునైటెడ్ కింగ్‌డమ్‌లో స్టోర్ చేసిన బంగారంలో లక్ష కేజీలను (100 టన్నులు) మన దేశంలోకి తరలించినట్టు రిజర్వ్‌బ్యాంక్ వెల్లడించిన సంగతి తెలిసిందే. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తడం, విదేశాల్లో ఉన్న రష్యా ఆస్తుల్ని అమెరికా ఫ్రీజ్ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆర్బీఐ స్వదేశానికి కొంత బంగారాన్ని తీసుకురావడం గమనార్హం.
ఇప్పుడు ఆర్బీఐ వద్ద 822 టన్నుల బంగారం ఉన్నది. అందులో దాదాపు సగం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌తో సహా వివిధ విదేశీ వాల్ట్స్‌లో ఆర్బీఐ స్టోర్ చేసింది. దేశపు బంగారం నిల్వలు ఆయా దేశ కేంద్ర బ్యాంక్ వద్ద ఉంటాయి. మన దేశమే కాదు.. ఇతర దేశాల కేంద్రబ్యాంక్‌లు సైతం వాటివద్దనున్న పుత్తడి నిల్వల్లో కొంత భాగాన్ని విదేశీ వాల్ట్స్‌లో ఉంచుతాయి. ఒకే చోట ఉంచితే ఏర్పడే రిస్క్‌ను తగ్గించుకోవడానికి, అంతర్జాతీయ ట్రేడింగ్‌కు వీలుగా ఉండేందుకు విదేశాల్లో అట్టిపెడతాయి.
ఆర్బీఐ ఎక్కడ స్టోర్ చేస్తుంది?
భారత్ బంగారం నిల్వల్లో అధిక భాగం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద ఉన్నాయి. కఠినమైన సెక్యూరిటీ ప్రొటోకాల్స్ పాటిస్తుందన్న పేరు ఈ బ్యాంక్‌కు ఉంది. ఆర్బీఐ మరికొంత బంగారాన్ని స్విట్జర్లాండ్ బసెల్ నగరంలో ఉన్న బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (బీఐఎస్), అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ వద్ద నిల్వ చేసింది.
సౌలభ్యాలు.. రిస్క్‌లు
1990 దశకం తొలినాళ్లలో మన దేశం విదేశీ కరెన్సీ కొరతతో సంక్షోభాన్ని ఎదుర్కొన్నపుడు 405 మిలియన్ డాలర్ల రుణం పొందేందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద కొంతమేర బంగారం నిల్వల్ని తనఖా పెట్టింది. ఆ రుణాన్ని 1991 నవంబర్‌లోనే చెల్లించినప్పటికీ, సౌలభ్యం కోసం ఆ బంగారాన్ని అక్కడే అట్టిపెట్టింది. విదేశాల్లో బంగారాన్ని స్టోర్ చేయడంవల్ల భారత్ ట్రేడ్ చేయడానికి, డాలర్లతో స్వాప్ చేసి రాబడిని పొందడానికి వీలుగా ఉంటుంది. కొన్ని రిస్క్‌లు కూడా ఉంటాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఏర్పడినా, యుద్ధాలు జరిగినా రిస్క్ ఉంటుంది.






