24 August, 2026 | 5:00 AM

యూనియన్ బ్యాంక్ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్ల సవరణ

02-06-2024 12:05 AM

399 రోజుల డిపాజిట్‌పై అధిక రేటు

న్యూఢిల్లీ, జూన్ 1: ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2 కోట్లు లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై(ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను సవరించింది. సాధారణ పౌరులకు సవరించిన వడ్డీ రేట్లు 3.5 శాతం మధ్య ఉండగా, సూపర్ సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 8 శాతం వడ్డీ రేటును బ్యాంక్ ఆఫర్ చేస్తున్నది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో పొందుపర్చిన సమాచారం ప్రకారం ఏడు రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీపై 3.5 శాతం వడ్డీని, 46 రోజుల నుంచి 90 రోజుల లోపు ఎఫ్‌డీలపై ఇక నుంచి 4.50 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నది.

91 రోజుల నుంచి 180 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.80 శాతం వడ్డీ లభిస్తుంది. 181 రోజుల నుంచి 1 ఏడాదిలోపు ఎఫ్‌డీలకు 6.25 శాతం వడ్డీ రేటును బ్యాంక్ నిర్ణయించింది. ఒక ఏడాది నుంచి 398 రోజుల కాలపరిమితిగల ఎఫ్‌డీలకు 6.75 శాతం, 399 రోజుల ఎఫ్‌డీపై 7.25 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నది. 400 రోజుల నుంచి 998 రోజుల లోపు ఎఫ్‌డీలకు 6.50 శాతం వడ్డీ రేటును, 999 రోజుల కాలపరిమితిగల డిపాజిట్లపై 6.40 శాతం వడ్డీ రేటును అందిస్తున్నది. 1000 రోజుల నుంచి పదేండ్ల కాలపరిమితిగల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇక నుంచి 6.50 శాతం వడ్డీని ఆఫర్ చేసింది. 

సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అధికం

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు అందించే రేటుకంటే సీనియర్ సిటి జన్లు 0.50 శాతం అదనపు వడ్డీ రేటుకు అర్హులు. వారికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 399 రోజుల ఎఫ్‌డీపై అత్యధికంగా 7.75 శాతం వడ్డీ లభిస్తుంది. అదే సూపర్ సీనియర్ సిటిజన్లకు సాధారణ పౌరుల ఎఫ్‌డీకంటే అదనంగా 0.75 శాతం వడ్డీ రేటును బ్యాంక్ ఇస్తుంది. దీంతో 399 రోజుల యూనియన్ బ్యాంక్ ఎఫ్‌డీపై సూపర్ సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.