మోదీ స్థాయికి ఇది తగదు
ముజ్రా వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్
హైదరాబాద్,మే 27(విజయక్రాంతి): ముస్లిం ఓటు బ్యాంక్ సంతృప్తి పర్చేందుకు ఇండియా కూటమి ముజ్రా డ్యాన్స్ చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్‌బాబు ఖండించారు. దేశ ప్రధానిగా 130 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి తాను ఒక మతానికి వ్యతిరేకమని చెప్పడం దురదృష్టకరమన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను గతంలో ఏ ప్రధాని చేయలేదన్నారు. దేశ ప్రలకు ఏ మతాన్నైనా అనుసరించే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిందన్నారు. ప్రధాని హోదాలో దేశ ప్రజలందరికీ తండ్రిలా వ్యహరించాలే తప్ప మైనార్టీలను కించపరిచే వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు.
దేశ విభజన సమయంలో కాంగ్రెస్ చూపిన ఔదార్యం వల్లే భారత్ ప్రశాంతంగా ఉందన్నారు. ఆ రోజుల్లో మోదీ లాంటి ప్రధాని ఉంటే రావణకాష్టంలా ఇప్పటికీ విద్వేషాలు రగులుతూ ఉండేవని ఆరోపించారు. మోదీ లేదా బీజేపీ హిందూవులందరికీ ప్రతినిధిగా భావించాల్సిన అవసరం లేదని, అన్ని పార్టీల్లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారని గుర్తు చేశారు. బీజేపీ ఎప్పటికీ దేశ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యూలరిజాన్ని రక్షించడం వల్లే అన్ని మతాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని చెప్పారు. వివక్ష చూపని కాంగ్రెస్ సుపరిపాలన వల్లే ఇది సాధ్యమైందన్నారు.






