31 July, 2026 | 6:17 PM

సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులకు సొంత భవనాలు

28-05-2024 01:42 AM

కార్పొరేట్ లుక్‌తో అత్యాధునికంగా.. 

ప్రజలకు సకల వసుతులు కల్పించాలి

అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశం

రాష్ట్రంలో 114 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు 

38 ఆఫీసులకు మాత్రమే సొంత భవనాలు 

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులను కార్పొరేట్ స్థాయిలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి ఆదాయమే చూసుకున్నది తప్ప సొంత భవనాలు నిర్మించలేదని, దీంతో రిజిస్ట్రేషన్లకోసం వచ్చేవాళ్లు కూర్చోడానికి కుర్చీలు కూడా లేవని, ఇకపై ప్రజలు చెట్ల కింద నీరిక్షించే పరిస్థితి ఉండకూడదని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు.

సంబంధిత అధికారులతో  చర్చించి అధునాతన భవనాల నిర్మాణానికి పలు సూచనలు చేశారు. మోడల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులున్నాయి. వీటిలో 38 మాత్ర మే సొంత భవనాల్లో ఉన్నాయి. అదిలాబాద్‌లోని బోథ్, మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఎన్నిక కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభం కానున్నాయి. మిగతా 104 ఆఫీసులు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 52 చోట్ల ఆఫీసులకు అవసర మయ్యే భవనాల నిర్మాణానికి ప్రభుత్వం భూమి కూడా కేటాయించింది. 

భూములు రెడీగా ఉన్న చోట వీలైనంత త్వరగా మోడల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులను నిర్మించాలని సీఎం సూచించారు. మిగతా 52 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సరిపడే స్థలాలను అన్వేషించాలని, ప్రజల అవసరాల కోసం సేకరించిన  స్థలాలు అందుబాటులో ఉంటే అక్కడే నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.

మొదటి దశలో అధికాదాయ కేంద్రాలు 

మొదటి దశలో ఆదాయం ఎక్కువగా తెచ్చి పెడుతున్న రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వాలని సీఎం నిర్ణయించారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే క్రయ, విక్రయదారులకు తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసేంత వరకు మంచి ఆతిథ్యమిచ్చి, ఆహ్లాదంగా ఉండే కార్పొరేట్ లుక్, వెయిటింగ్ హాల్, డ్రింకింగ్ వాటర్, కెఫెటేరియా లాంటి అన్ని సదుపాయలుండాలని సీఎం సూచించారు. ఆదాయం తక్కువగా ఉన్న జిల్లాల ఆఫీసుల నుంచి ఎక్కువ పని ఉన్న చోటికి సిబ్బందిని సర్దుబాటు చేయాలని అన్నారు.