చిన్నారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పాఠశాలల యాజమాన్యాలదే
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి
మేడ్చల్, డిసెంబర్ 2 (విజయ క్రాంతి): చదువుతోపాటు చిన్నారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యా లదే అని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ చైర్ పర్సన్ సీత దయాకర్ అన్నారు. మంగళవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేప్టి అండ్ సెక్యూరిటి ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ ద స్కూల్ అనే కార్యక్రమానికి కమీషన్ సభ్యులు చందన, సరిత, డిఈఓ విజయ కుమారిలతో కలిసి హాజరైనారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల జరిగిన చిన్నారిపై ఆయమ్మ చేయి చేసుకున్నటుంవంటి ఘటనలు పునరావృతం కాకుం డా ఉండేందుకుగాను ప్రైవేట్ స్కూల్స్‌లో ఉపాధ్యాయులకు అవగాహాన, కౌన్సిలింగ్స్, సేప్టీ మెజర్స్, పిల్లలకి కౌన్సలర్స్, సిసి కెమెరాలు, వెహికిల్స్ మెజర్స్, పొక్సొ చట్టం పై అవగాహన వంటి అంశాల పై ఫైలెట్ ప్రాజెక్టుగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాను ఎంపిక చేసుకొని బాలలరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారా లేదా అని పర్యవేక్షిస్తామని ఛైర్మన్ సీత దయాకర్ అన్నారు.
పిల్లల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, పాఠశాలలో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని అన్నారు. మన ఇంట్లో పిల్లల పట్ల ఎంత బాధ్యతగా ఉంటామో అంతే బాధ్యత వారిపట్ల ఉండాలన్నారు. సంఘటనలు జరిగిన తరువాత తీసుకునే చర్యలకంటే, ముందుగా తీసుకునే నివారణ చర్యలు ముఖ్యమన్నారు. ఇటువంటి సంఘటనలు తలెత్తకుండా పాఠశాల యాజమాన్యాలు బాద్యతగా వ్యవహరించాలన్నారు.
పిల్లలకు శారీరక శ్రమ అవసరమని అందుకు గ్రౌండ్స్ లో అడుకోవాలని తద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని తెలిపారు. పిల్లలకు సంబంధించిన చట్టాల పట్ల పాఠశాలలోని సిబ్బంది అందరికి అవగాహాన కల్పించడమే కాకుండా చట్టాలు అమలు పరచాలని సూచించారు. ప్రతి పాఠశాలలో కమిటిలను ఏర్పాటు చేసుకొని ప్రతి నెల సమావేశమై సమస్యలను చర్చించి సమస్యలను అధిగమించేలా చూడాలన్నారు.
పిల్లల పరిరక్షణ చాలా ముఖ్యమని చిన్న చిన్న నిర్లక్షాలతో పెద్ద సమస్యలు ఉత్పన్నమవుతాయని, ఎలాంటి నిర్లక్ష్యాలకు తావు లేకుండా పూర్తి బాధ్యత స్కూల్ యాజమాన్యాలు తీసుకోవాలన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా మాట్లాడుతూ ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించి వారిని కాపాడాలన్నారు.
పిల్లలకు తల్లిదండ్రులతో పాటు టీచర్లే ముఖ్యమని, వారి భవిష్యత్తుకు టీచర్లే బాధ్యులన్నారు. తెలంగాణాకు ఉత్తమ పౌరులను అందించే బాధ్యత టీచర్లదేనని, అందరి విద్యార్థుల పట్ల శ్రద్ద వహించాలని ఒకరు, ఇద్దరి పట్ల నిర్లక్ష్యం వహించిన అది సరికాదన్నారు. పాఠశాలయాజమాన్యాలు తెలిపిన సమస్యలను తాము పరిశీలిస్తామని అదనపు కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శారద, జిల్లా ఇంటర్మిడియెట్ అధికారి కిషన్, ప్రైవేట్ పాఠశా లల యాజమాన్యాలు పాల్గొన్నారు.




