‘నీట్’గా వివాదాలు!
దేశంలో వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్’ పరీక్ష మరోసారి వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. 2024లో చో టుచేసుకున్న పేపర్ లీక్ ఘటనను మరువకముందే, 2026లో మరోసారి పేపర్ లీక్ కారణంగా పరీక్ష రద్దు కావడం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 22 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ ప్రవేశ పరీక్షపై నమ్మకం సన్నగిల్లడం దేశ విద్యావ్యవస్థకు ఏ మాత్రం మంచింది కాదని చెప్పాలి. వాస్తవానికి రాష్ట్రస్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో నీట్ సహా అనేక ప్రవేశ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పర్యవేక్షణ కిందికి తీసుకువచ్చిన విషయం విదితమే.
అయితే, ఈ నిర్ణయం వల్ల పారదర్శకత పెరగకపోగా, అవకతవకలు మరింతగా ఎక్కువకావడం శోచనీయం. 2024లో నీట్‌తోపాటు యూజీసీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలతో అభాసుపాలైనా ఎన్టీఏ పనితీరు మారలేదు. సీబీఐ దర్యాప్తు, సుప్రీంకోర్టు జోక్యంతో నాడు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం నాటి ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోద్ కుమార్‌సింగ్‌ను పదవి నుంచి తొలగించడం, హైలెవెల్ కమిటీ పేరిట హడావుడి చేసి వేసి బయోమెట్రిక్ వెరిఫికేషన్ లాంటి చర్యలతో చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిచ్చింది. నీట్ పరీక్షలో మళ్లీ అవకతవకలు చోటుచేసుకోవడం, చివరకు పరీక్ష రద్దు కావడంతో సంస్కరణలు ప్రకటనలకే పరిమితమయ్యాయని చెప్పక తప్పదు.
ఈ నేపథ్యంలోనే ఎన్టీఏ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం లోపించడం, ఎన్టీఏను కేంద్రప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, పరీక్షల నిర్వహణ వ్యవస్థపై విద్యార్థులు నమ్మకం కోల్పోవడం అత్యంత ప్రమాదకరమని చెప్పాలి. లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షలు రాస్తున్న తరుణంలో అవకతవకలు, లీకులు జరగడం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అందుకు కేవలం టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ సరిపోదు. పరీక్షా కేంద్రాల ఏర్పాటు నుంచి ప్రశ్నపత్రాల రవాణా వరకు ప్రతి దశలోనూ కఠిన చర్యలు చేపట్టాలి. లేకపోతే పరీక్షల నిర్వహణపై నెలకొన్న అనుమానాలు మరింత బలపడే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే విద్యార్థుల్లో నైరాశ్యం పేరుకుపోయి విద్యావ్యవస్థ కుప్పకూలిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.






