16 May, 2026 | 1:34 AM

పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తుంది

16-05-2026 01:03 AM

ప్రభుత్వ విప్ వేముల వీరేశం

కట్టంగూరు, మే 15 : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి గింజలు మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన కట్టంగూర్, చిట్యాల, నార్కట్పల్లి మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత అయిటిపాముల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోలు ప్రక్రియను, తూకాలను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిట్యాల పట్టణంలోని వరలక్ష్మి మిల్ వద్ద గల ధాన్యం దిగుమతి కేంద్రాన్ని సందర్శించి, నిల్వ, రవాణా సౌకర్యాలను సమీక్షించారు.

నార్కట్పల్లి పట్టణ కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తనిఖీ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.  ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

తేమ, తాలు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని అధికారులను హెచ్చరించారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. రైతుల శ్రమకు తగిన గౌరవం దక్కేలా చూడటం మా బాధ్యత. పండించిన ప్రతి గింజను ప్రభుత్వం సేకరిస్తుందని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు మెరుగైన సేవలందించాలన్నారు. ఈయన వెంట పలువురు రైతులు ఉన్నారు.