07-10-2025 12:00:00 AM
ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘థామ్మా’. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా రొమాంటిక్ సినిమా ఇది. కొన్ని అతీంద్రియ శక్తులతో కూడిన ప్రేమే ముఖ్య కథాంశంగా తెరకెక్కిస్తున్న ఈ వినోదాత్మక చిత్రం అక్టోబర్ 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ‘నువ్వు నా సొంతమా..’ అంటూ సాగే పాటను విడుదల చేసింది.
ఈ గీతంలో రష్మిక తన అందచందాలతో ఆకర్షించడమే కాకుండా డ్యాన్స్ మూమెంట్స్‌తో కట్టిపడేస్తోంది. అయితే, ఈ పాట విశేషాలను రష్మిక తాజాగా సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. కొన్ని సాంగ్ స్టిల్స్‌ను కూడా షేర్ చేసింది. విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం అంటూ వస్తున్న వార్తలతో ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉన్న రష్మిక తాజాగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. “మేము దాదాపు 12 రోజుల పాటు ఓ అందమైన ప్రదేశంలో థామ్మా చిత్రీకరణ జరిపాం.
ఆ షూటింగ్ చివరిరోజు మా దర్శకనిర్మాతలకు ఓ ఆలోచన వచ్చింది. ‘ఈ ప్రదేశం ఇంత బాగుంది.. మనం ఇక్కడ ఓ పాట ఎందుకు షూట్ చేయకూడదు’ అనేదే వారి ఆలోచన. నాతో సహా అందరికీ ‘ఔను కదా’ అనిపించింది. ఎందుకంటే ఆ లొకేషన్ అంత అద్భుతంగా ఉంది. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా 3 రోజుల్లో రిహార్సల్స్ చేసి సాంగ్ షూట్ చేశాం. పాట చిత్రీకరణ అయిపోయాక చూసి, అందరూ ఆశ్చర్యచకితులయ్యారు.
ఎందుకంటే ముందస్తు ప్రణాళికతో చేసిన వాటికంటే కూడా ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది. ఈ పాటలో భాగమైన ప్రతి ఒక్కరికి అభినందనలు. ఈ సాంగ్‌ను ప్రేక్షకులు కూడా థియేటర్లలో ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా” అని చెప్పింది. ఇక ఈ నేషనల్ క్రష్ సినిమాల విషయానికి వస్తే.. ‘థామ్మా’తోపాటు రష్మిక ప్రధాన పాత్రలో నటించిన మరో సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.