07-10-2025 12:00:00 AM
ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం నటనకు దూరంగా ఉన్న సమంత మళ్లీ ఇప్పుడు ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. నిరుడు ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్‌సిరీస్‌తో తనలోని యాక్షన్ యాంగిల్‌ను చూపిన ఈ భామ ఇటీవల తన సొంత ప్రొడక్షన్ ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్‌లో రూపొందించిన ‘శుభం’తో అతిథి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ ప్రాజెక్టులో నటిస్తోంది.
ఇదిలా ఉండగా సమంత తాజాగా ఇన్‌స్టా ఫాలోవర్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె గత ఏడాది తన పుట్టినరోజున ప్రకటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా గురించి ఓ అప్‌డేట్‌ను పంచుకుంది. ‘మీ అప్‌కమింగ్ ప్రాజెక్టు ఏంటి?’ అని ఓ అభిమాని అడగ్గా.. ‘మా ఇంటి బంగారం’ అని తెలిపింది.
ఈ ప్రాజెక్టు ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభించుకోనుందని చెప్పింది. దీనికి నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు సమంత చాలా కాలం తర్వాత నేరుగా తెలుగులో మరో సినిమాతో వస్తుండటం పట్ల అభిమానులు సంబరపడుతున్నారు.