15 April, 2026 | 5:50 AM

బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నది కేసీఆరే

08-02-2026 12:15 AM
  1. బీసీ వ్యతిరేకి మాధవరెడ్డికి.. బీఆర్‌ఎస్ టికెట్‌తోనే స్పష్టం 
  2. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది బీఆర్‌ఎస్ పార్టీ అనే విషయం స్పష్టమైందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ వెనుకుండి.. రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేశారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేసి అడ్డుకున్న మాధవరెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వడమే ఇందు కు నిదర్శనమని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు.

మేడ్చల్ జిల్లా పరిధిలోని మూడుచింతలపల్లి మున్సిపాలిటీలోని కేశవాపురం (పదోవార్డు) నుంచి మాధవరెడ్డి బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తున్నారని  తెలిపా రు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న వ్యక్తిని బీఆర్‌ఎస్ నాయకత్వం పెంచి పోషిస్తోందని, మాధవరెడ్డి వెనుక కల్వకుంట్ల కుటుంబం ఉందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు అమలైతే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందన్న భయంతోనే కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీల నోటికాడి ముద్దను లాక్కున్న వీరిద్దరికి బీసీలు బుద్ధి చెప్పాలని, మున్సిపల్ ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెట్టాలని పిలుపు ఇచ్చారు. గవర్నర్ వద్ద ఉన్న బీసీ బిల్లు ఆమోదం కాకుండా బీజేపీ అడ్డుకుంటోదన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి అడ్డు కుంటున్న ఈ రెండు పార్టీలను మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కోరారు.