05-10-2025 01:27:04 AM
బయటి వ్యక్తుల కష్టాల గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అదే ఇండస్ట్రీకి చెందినవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎవరూ పట్టించుకోరు అంటూ నిట్టూర్చింది బాలీవుడ్ భామ జాన్వీకపూర్. ఇటీవల ఇన్‌సైడర్ వర్సెస్ అవుట్‌సైడర్ అనే ప్రోగ్రాంలో పాల్గొన్న జాన్వీ సినీ ఇండస్ట్రీలో నేపోటిజం, బయటి వ్యక్తుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
“బయటి వ్యక్తులు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో పోరాటాలు చేయాల్సి వస్తుందనేది వాస్తవమే. అది నేనూ అంగీకరిస్తాను. ఆ సమస్యలు ఇండస్ట్రీలో ఉండే స్టార్ కిడ్స్‌కు అర్థం కావు. అయితే, బయటి నుంచి వచ్చినవారిని ఇండస్ట్రీ వారితో పోల్చడం సరికాదు. బయటి వ్యక్తులు, ఇండస్ట్రీకి చెందినవారిని వేరు చేసి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. కానీ, చాలా మంది నెపోకిడ్స్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు.
స్టార్ కిడ్స్ తమ ఇబ్బందులు చెప్పుకుంటుంటే విడ్డూరంగా అనిపిస్తుంది. వాటిని వినడానికి కూడా ఆసక్తి చూపించరు. అందుకే స్టార్ కిడ్స్ తమ కష్టాలను చెప్పుకోడానికి ఇష్టపడరు. వారిలో ఈ తీరు వెనుక ఉన్న ఉద్దేశం తమకు లభించిన సౌకర్యాలకు కృతజ్ఞతగా ఉండటమే” అని తెలిపింది జాన్వీ. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఆమె ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ‘పెద్ది’ సినిమా చేస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్న ఈ సినిమాలో జాన్వీ క్యారెక్టర్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి 27న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.