17 March, 2026 | 3:52 AM

Breaking News

అంతా తప్పుల తడకే!

17-03-2026 01:27 AM

బల్దియా పన్ను నివేదికలో లెక్క తేలని వెయ్యి ఆస్తులు

కమిషనర్ ప్రెస్‌మీట్ గణాంకాల్లో పొరపాట్లు?

రూ.824 కోట్లు అన్నారు.. రూ.823.72 కోట్లే వచ్చాయి

మిగిలిన 28 లక్షలు ఏవీ?


హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 16 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను వసూళ్ల నివేదిక నవ్వులపాలవుతోంది. పన్ను బకాయిదారులకు గోల్డెన్ ఛాన్స్ అంటూ సోమవారం కమిషనర్ ఆర్‌వి కర్ణన్ నిర్వహించిన మీడియా సమావేశంలో పంపిణీ చేసిన అధికారిక గణాంకాలు తప్పుల తడకగా ఉండటం చర్చనీయాంశమైంది.

ఒక వైపు వేల కోట్ల బకాయిల వసూలు కోసం ప్రభుత్వం 90 శాతం వడ్డీ రాయితీతో వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) ప్రకటించినా క్షేత్రస్థాయిలో యంత్రాంగం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమైందనేది తాజా నివేదిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. నివేదికలోని కూడికలు, తీసివేతల్లో వందల కోట్ల వ్యత్యాసాలు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి.

మాయమైన వెయ్యి పీటీఐఎన్ నంబర్లు

కమిషనర్ విడుదల చేసిన నివేదిక ప్రకా రం పునర్విభజించిన జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 11 లక్షల 45 వేల ఆస్తి పన్ను ఇండెక్స్ నంబర్లు ఉన్నాయి. ఇందులో 6.31 లక్షల మంది పన్ను చెల్లించారని, మిగిలిన 5.13 లక్షల మంది ఇంకా బకాయి పడ్డారని అధికారులు పేర్కొన్నారు. అయితే, అధికారులు చెప్పిన ఈ రెండు అంకెలను 6.31 + 5.13 కలిపితే మొత్తం 11.44 లక్షలు మాత్ర మే వస్తోంది. మరి అధికారులు మొదట చెప్పిన 11.45 లక్షల్లో మిగిలిన ఆ వెయ్యి పీటీఐఎన్ నంబర్లు ఏమయ్యాయన్నది ఇ ప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 

వసూళ్ల లెక్కల్లోనూ గందరగోళమే

జోన్ల వారీగా పన్ను వసూళ్ల వివరాల్లో నూ గమ్మత్తున లెక్కలు బయటపడ్డాయి. మొత్తం ట్యాక్స్ కలెక్షన్ రూ.824 కోట్లుగా నివేదిక హెడ్‌లైన్‌లో పేర్కొన్నారు. కానీ, కింద ఇచ్చిన టేబుల్‌లో ఆరు జోన్లు చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, రాజేం ద్రనగర్, సికింద్రాబాద్, శంషాబాద్ వసూళ్లను విడివిడిగా చూపిస్తూ వాటి మొత్తాన్ని మాత్రం రూ.823.72 కోట్లుగా చూపించారు. అంటే అధికారులు ప్రకటించిన మొ త్తంలో సుమారు రూ.28 లక్షల వ్యత్యాసం కనిపిస్తోంది. ఇది కేవలం గణిత శాస్త్ర పొరపాటా.. లేక కలెక్షన్ లో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నమా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

10 శాతం దాటని ‘ఓటీఎస్’

పాత మొండి బకాయిలపై వడ్డీలో 90 శాతం రాయితీ ఇచ్చే ఓటీఎస్ పథకం గ్రేటర్‌లో ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. గత డిసెంబర్‌లోనే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, జీహెచ్‌ఎంసీ ఈ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఘోరం గా విఫలమైంది. నివేదిక ప్రకారం.. మొత్తం 11.45 లక్షల ఆస్తులలో కేవలం 1.11 లక్షల మంది లక్షా 11 వేల 835 మాత్రమే ఇప్పటి వరకు ఓటీఎస్ కింద పన్ను చెల్లించారు. అంటే ఈ రాయితీ పథకాన్ని వాడుకున్న వారు కనీసం 10 శాతం కూడా లేకపోవడం గమనార్హం. మార్చి 31 గడువు సమీపిస్తున్నా అధికారుల తీరులో మార్పు రావడం లేదు.

5 లక్షల మందికి పైగా బకాయిదారులు ఉంటే, గత 15 రోజుల్లో కేవలం 1,64,807 మందికి మాత్రమే నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. ఒకవైపు నిధుల్లేక ఉద్యోగుల జీతాలకు ఇబ్బందులు తలెత్తుతుంటే, మరోవైపు ఆదాయం పెంచుకునే పకడ్బందీ ప్రణాళికలు రూపొందించకుండా తప్పుల నివేదిక లతో కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం సర్కిల్ స్థాయిలో వారంట్ ఆఫీసర్లను నియమించామని, ఆస్తుల జప్తు చేస్తామని అధికారులు చె బుతున్నా.. పారదర్శకమైన గణాంకాలు లేకుండా ఈ ప్రక్రియ ఎలా సాగుతుందో చూడాలి.