17 March, 2026 | 2:43 AM

90 లక్షల టన్నుల ధాన్యం కొంటాం

17-03-2026 01:37 AM
  1. రబీ ఈ సీజన్‌లో 152.03 లక్షల టన్నుల దిగుబడి అంచనా
  2. రాష్ట్రవ్యాప్తంగా 8,251 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
  3. గ్రేడ్- ఏ కు క్వింటాల్‌కు రూ.2,389 మద్దతు ధర
  4. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి16 (విజయక్రాంతి): రబీ సీజన్ 2025-26లో ముందెన్నడూ లేని రీతిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నా రు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రబీ సీజన్‌లో 54.48 లక్షల ఎకరాల్లో 152.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన తదితర ఏర్పాట్లపై సోమవారం ఉదయం బేగంపేటలోని ఐఏఎస్ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలసి అదనపు కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల శాఖాధి కారులు, ఆయా జిల్లాల సివిల్ సప్లయ్స్ మేనేజర్లతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ 2025- 26 రబీ సీజన్‌లో ఉత్పత్తి అయిన ధాన్యం దిగుబడిలో వ్యవసాయ రంగ చరిత్రలోనే ముందె న్నడూ లేని తీరులో 90 లక్షల మెట్రిక్ టన్ను ల ధాన్యం కొనుగోలుకు సమగ్ర కార్యాచరణను రూపొందించామన్నారు. అందులో 60 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 30 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం ఉంటుందన్నారు.

ధాన్యం కొనుగోలులో రైతాం గానికి ఎక్కడా అవాంతరాలు ఎదురు కాకుం డా ఉండేందుకు ధాన్యం ఉ త్పత్తికి తగినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా 8,251 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.  కొనుగోలు చేసిన ధాన్యానికి కేంద్ర ప్రభు త్వం నిర్ణయానుసారంగా మద్దతు ధర చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గ్రేడ్ -ఏ, సాధారణ విభాగలుగా గుర్తించి, గ్రేడ్ -ఏ కు రూ.2,389, సాధారణ వరికి రూ.2,369 చెల్లించనున్నట్లు  తెలిపారు.

రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడికి అనుగుణంగా పెరిగిన మద్ద తు ధరతో రైతులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుందని, తద్వారా రైతాంగానికి ఆదా యం వస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ప్రభు త్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల్లో  టార్భాలిన్ షీట్లు, ఎలక్ట్రానిక్ తుకాలు, తేమను కొలిచే పరికరాలు, ఆటోమేటిక్ వరి క్లీనర్లు, డిజిటల్ డయల్ కాలిపర్స్, హస్క్ రిమువర్లతో పాటు సరిపడా గన్నీ బ్యాగులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు.  సరిపడా వాహనాల ఏర్పాట్లను ముందుగానే చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్  అధికారంలోకి వచ్చాక పంట పంటకూ రికార్డు స్థాయిలో దిగుబడి పెరుగుతోందన్నారు.  ఖరీఫ్ సీజన్‌కు రబీ సీజన్‌కే ధాన్యం ఉత్పత్తి గణనీయం గా పెరిగిందని, ఇది తెలంగాణలో రైతాంగం సాధించిన విజయంగా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అభివర్ణించారు.