19 May, 2026 | 5:12 PM

బంద్‌కు జైనూర్ మెడికల్ అసోసియేషన్ మద్దతు: ఎమ్మార్వోకు వినతి

19-05-2026 04:03 PM

జైనూర్: ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మే 20న దేశవ్యాప్తంగా కెమిస్టులు చేపట్టిన బంద్‌కు జైనూర్ మెడికల్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మంగళవారం అసోసియేషన్ సభ్యులు జైనూర్ ఎమ్మార్వో బీర్షావ్ వినతిపత్రం అందజేశారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) పిలుపు మేరకు ఈ బంద్ జరుగుతోందని నాయకులు తెలిపారు.

ఆన్‌లైన్‌లో భారీ డిస్కౌంట్లతో మందులు అమ్మడం వల్ల చిన్న మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు ఈ వ్యాపారంపైనే ఆధారపడ్డాయని, ఆన్‌లైన్ విక్రయాల వల్ల వారి ఉపాధి ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. నకిలీ మందుల విక్రయాలను అరికట్టాలని, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీఎస్ఆర్ 817, జీఎస్ఆర్ 220 నోటిఫికేషన్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్య భద్రత దృష్ట్యా మెడికల్ రంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్, ఉపాధ్యక్షుడు హుస్సేన్, సభ్యులు సాబిల్, ప్రకాష్, నాందేవ్, ముషారఫ్ తదితరులు పాల్గొన్నారు.