అదనపు సభ్యులకు నో ఛాన్స్
ఆసియా క్రీడలపై జపాన్ ప్రకటన
టోక్యో, ఆగస్టు 26: వచ్చే నెలలో జపాన్(Japan) వేదికగా ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆతిథ్య జపాన్ దేశం కీలక ప్రకటన చేసింది. పెరుగుతున్న క్రీడాకారుల సంఖ్య, వసతి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈసారి క్రీడల్లో పాల్గొనేవారిపై జపాన్ కఠినమైన పరిమితులు విధించింది. వసతి కొరత కారణంగా ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే మొత్తం క్రీడాకారులు, అధికారుల సంఖ్యను 15,000 మందికి మాత్రమే జపాన్ పరిమితం చేసింది.
గడువు ముగిసిన తర్వాత అదనపు సభ్యులను చేర్చవద్దని భారత ఒలింపిక్ అసోసియేషన్ సహా అన్ని ఆసియా దేశాల జాతీయ ఒలింపిక్ కమిటీలను ఆసి యా ఒలింపిక్ కౌన్సిల్ గట్టిగా హెచ్చరించింది. మొత్తం అథ్లెట్ల సంఖ్యలో సపోర్ట్ స్టాఫ్ (కోచ్లు, మేనేజర్లు) కేవలం 33 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం నిర్వాహకులు 15 వేల మంది పరిమితిని దాటేందుకు వీల్లేదని తేల్చిచెప్పడంతో ఇకపై కొత్తగా ఎలాంటి అభ్యర్థనలను స్వీకరించబోమని ఓసీఏ స్పష్టం చేసింది. వచ్చే నెల 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లోని నగోయా వేదికగా ఆసియా క్రీడలు జరగనున్నాయి. మొత్తం 45 దేశాలకు చెందిన క్రీడాకారులు 43 క్రీడాంశాల్లో పోటీపడనున్నారు






