నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష
హాజరుకానున్న 1.91 లక్షల మంది అభ్యర్థులు
డ్రెస్ కోడ్ అమలు, ఆభరణాలపై నిషేధం
సాధారణ చెప్పులకే అనుమతి
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ పరీక్ష ఈరోజు (ఆదివారం) జరగనుంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.91 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఐఐటీ మద్రాస్ ఈసారి పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా దాదాపు 46 వేల మంది హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 26 కేంద్రాలు, తెలంగాణలో 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.
ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతిలేదు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్‌ల కింద పేపర్ పేపర్ పరీక్షలు జరగనున్నాయి. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షలో అభ్యర్థులు రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరగనుంది. గతంలో కంటే ఈసారి అభ్యర్థులు ఎక్కువ మంది పరీక్షకు హాజరవుతున్నారు. 2023లో 1.89 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు.
డ్రెస్ కోడ్ అమలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు సంబంధించి అధికారులు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. వీటిని అభ్యర్థులు తప్పక పాటించాలని సూచించారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్‌తోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డు ప్రింటెడ్ కాపీని వెంట తెచ్చుకోవాలని సూచించారు. పరీక్షార్థులకు ఐఐటీ మద్రాస్ ప్రత్యేక డ్రెస్ కోడ్‌ను కూడా జారీ చేసింది. బాలబాలికలు పరీక్ష హాలులో ఉంగరాలు, కంకణాలు, చెవి రింగులు, ముక్కు పిన్నులు, తాయెత్తులు, పెద్ద చెవిపోగులు, నెక్లెస్‌లు, చైన్‌లు, కంచాలు ధరించకూడదు.
కుర్తా, సాంప్రదాయ కుర్తాలతోపాటు పెద్ద బటన్లు ఉన్న దుస్తులపై నిషేధం విధించారు. బూట్లకు బదులు సాధారణ చెప్పులు ధరించాలని మార్గదర్శకాల్లో వెల్లడించారు. హ్యాండ్‌బ్యాగులు, కళ్లద్దాలు, వాచ్, మొబైల్ ఫోన్, బ్లూటూత్ పరికరం లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. పెన్సిల్, ఎరేజర్ తెచ్చుకోవచ్చు. జూన్ 9న తుది కీ విడుదల చేసి అడ్వాన్స్‌డ్ ఫలితాలను ప్రకటించనున్నారు.జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ ద్వారా ఎన్‌ఐటీల్లో దాదాపు 24 వేల సీట్లు, ఐఐటీల్లో 17,385 సీట్లు, ఐఐఐటీల్లో 16 వేల సీట్లు భర్తీ కానున్నాయి.






