నిధులు బంద్
బ్రాహ్మణ పరిషత్‌పై కాంగ్రెస్ సర్కారు శీతకన్ను
ఆగిపోయిన అన్ని పథకాలు
పరిషత్‌లో మూడు నెలలుగా వేతనాలు కరువు
స్కాలర్‌షిప్‌లు అందక విద్యార్థుల అవస్థలు
ఆంధ్రప్రదేశ్‌లో అక్కున చేర్చుకొంటున్న సర్కారు
బ్రాహ్మణుల సంక్షేమానికి టీడీపీ సర్కారు చర్యలు
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధి కారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ప్రాధాన్యమిస్తూ ప్రజలు మన్ననలు పొందుతుంటే.. తెలంగాణలో ఎనిమిది నెలల క్రితం అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఎదుర్కొంటోంది. బ్రాహ్మణుల సంక్షేమానికి సంబంధించిన బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు విడుదల చేయకపోవ డంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
గత ప్రభుత్వం రూ.100 కోట్లతో బ్రాహ్మణ పరిషత్‌ను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లా గోపనపల్లిలో 6 ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్ల వ్యయంతో తెలంగాణ బ్రాహ్మణ సేవ పరిషత్ (టీబీఎస్‌పీ)ను నిర్మించింది. దానిలో పని చేస్తున్న సిబ్బందికి గత మూడునాలుగు నెలలుగా వేత నాలు అందటం లేదు. దీంతో వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికలకు ముందు బ్రాహ్మణ పరిషత్‌ను రెండింతల నిధులతో మరింత బలోపేతం చేస్తామని ప్రకటించిన నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంగతే మరచి పోయారనే విమర్శలు వస్తున్నాయి.
విద్యార్థుల తిప్పలు వర్ణనాతీతం
గత ప్రభుత్వం వివేకానంద విదేశీ విద్యాపథకం ఏర్పాటు చేసి సుమారు 121 మంది విద్యార్థులకు రూ.24.20 లక్షలు అందించింది. ప్రస్తుతం ఆ పథకం కింద రావాల్సిన సుమారు రూ.15 కోట్లు ప్రభుత్వం విడుదల చేయకపోవటంతో వివిధ దేశాల్లో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. తెలం గాణలో టీఎస్‌పీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు బీసీ సంక్షేమశాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా 12 బీసీ స్టడీ సర్కిళ్లలో బ్రాహ్మణ అభ్యర్థులు కోచింగ్ తీసుకునేలా ఏర్పాటు చేసింది. కానీ కొత్త ప్రభత్వం ఈ విషయాన్ని పట్టించుకోక పోవడంతో వారు ప్రైవేట్ సంస్థల్లో కోచింగ్ తీసుకుంటూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఉపాధి లేదు.. ఆరోగ్యం లేదు
తెలంగాణలో పేద బ్రాహ్మణులు వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు స్థాపించుకొనేందుకు రూ.లక్షకు ౮౦ శాతం, రూ.2 లక్షలయితే 60 శాతం ప్రభుత్వం రాయితీ ఇచ్చేది. ప్రస్తుత ప్రభుత్వం దానిని కూడా పట్టించుకోక పోవడంతో చిరు వ్యాపారాలు చేసుకొనే బ్రాహ్మణులు వ్యాపారాలను పక్కన పెట్టి ఇతర ఉద్యోగాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో పేద బ్రాహ్మణులు అనారోగ్యంతో దవాఖాన పాలైతే ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో వేద పాఠశాల అభివృద్ధికి రూ.2 లక్షల అందిస్తుంటే, వాటిలో వేద విద్యను అభ్యసించే ఒక్కో విద్యార్థికి నెలకు రూ.25౦ ఉపకార వేతనంగా ఇస్తున్నారు. విద్యార్థుల జీవనోపాధికి రూ.3 లక్షలు, విద్య పూర్తిచేసిన వారికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందించేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో వేద పాఠశాలలు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రూ.100 కోట్లతో బ్రాహ్మణ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసినప్పటికీ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో సంక్షేమ బోర్డు నామమాత్రంగా నిర్వహిస్తున్నారు.
దీపాలకు నూనె కరువు
తెలంగాణలో ఆలయాల్లో దూపదీప నైవేద్యం పథకం కింద ప్రతి నెలా గత ప్రభుత్వం నిధులు అందించేది. ప్రస్తుత ప్రభుత్వంలో ఆ నిధులు విడుదల కాకపోవడంతో పూజారులే తమ జేబులోంచి ఖర్చులను భరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం దేవాదాయ శాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించగా నిధుల విడుదల అంశం చర్చకు వచ్చింది. త్వరలో ఇందుకు సంబంధించిన నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చింది. పేద బ్రాహ్మణులకు సొంతింటి కల సాకారం కాక పోవడంతో వారు అద్దె ఇళ్లలోనే జీవితాలను వెళ్లదీస్తున్నారు. 75 సంవత్సరాలు దాటిన వేద పండితులకు గత ప్రభుత్వం నెలకు రూ.2,500 గౌరవ భృతి ఇచ్చేది. ప్రస్తుత ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయకపోవడంతో వృద్ధాప్యంలో పండితులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలో పేద బ్రాహ్మణులకు ఎటువంటి రాజకీయ రిజర్వేషన్లు లేక పోవడంతో వారు రాజకీయాలకు దూరంగా ఉంటూ తమ వృత్తుల్లోనే కొనసాగుతున్నారు.
ఏపీలో ఆపన్న హస్తం
ఏపీలో నూతనంగా ఏర్పడ్డ తెలుగుదేశం ప్రభుత్వం పేద బ్రాహ్మణుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. విదేశాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మక కాలేజీల్లో నాణ్యమైన విద్యను అభ్యసించే బ్రాహ్మణ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నది. పోటీ పరీక్షలు, ప్రొఫెషనల్ కోర్సులకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు కోచింగ్ సెంటర్లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నది. సంప్రదాయ, ఆధునిక వృత్తుల్లో నైపుణ్యాభివృద్ధి వర్క్‌షాప్‌ల ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించి ఆర్థిక స్వాతంత్య్రం కల్పిస్తోంది. ఔత్సాహిక బ్రాహ్మణ పారిశ్రామికవేత్తలకు తక్కువ వడ్డీకే ఆర్థిక సాయం అందిస్తోంది. సొంతగా వ్యాపారం చేసుకోవాలనుకొనే వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఆర్థికంగా సాయం చేస్తున్నది. పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడమే కాకుండా ప్రత్యేకంగా వైద్య చికిత్స శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నది.
బ్రాహ్మణ సంఘం నిర్దిష్ట సమస్యలను పరిష్కరిచేందుకు, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేశారు. బ్రాహ్మణులకు రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పించేందుకు అన్ని రాజకీయ కార్యకలాపాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, సర్పంచ్‌లలో 1 శాతం సీట్లను రిజర్వ్ చేశారు. ప్రతి జిల్లాల్లో ఏఎస్‌ఏటీ కమిషనర్ పోస్టు అయిన ఎండోమెంట్‌కు సమానమైన ఒక ఆగమ సహస్ర పండిట్ పోస్టును ఏర్పాటు చేశారు. దేవాలయంలో పనిచేసే పూజారులు, సర్వీబుల్ ఇనాం భూములు కలిగి ఉన్న పూజారి వర్గాలకు 5 ఎకరాల భూమిని కేటాయించారు. పేద బ్రాహ్మణులకు తక్కువ ధరలో నాణ్యమైన గృహ నిర్మాణ పథకం అమలు చేస్తూ వారి సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తోంది. వృద్ధాప్యపెన్షన్లు, నిరుపేదలకు ఆర్థిక సాయంతోపాటు సామాజిక భద్రత చర్యలు అమలు చేస్తున్నది.






