ఒరాకిల్‌లో 30 వేల ఉద్యోగాల తొలగింపు
- ఉదయం 6 గంటలకు ఉద్యోగులకు ఈమెయిల్
- తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సిబ్బంది
న్యూఢిల్లీ, మార్చి 31: కొన్ని రోజుల ఊహాగానాల తర్వాత, ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఒరాకిల్ భారీగా ఉద్యోగ కోతలను ప్రారంభించింది. సుమారు 30 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ సన్నద్ధమైంది. ఇప్పటికే మంగళవారం తెల్లవారుజాము నుంచే సంబంధిత ఉద్యోగులకు సంస్థ నుంచి ఈ మెయిల్స్ రావడం మొదలయ్యాయి. కాగా సంస్థ తీసుకున్న నిర్ణయం ఉద్యోగులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తమను ఉద్యోగాల నుంచి తొలగించడంతో వారు షాక్‌కు గురయ్యారు. తెల్లవారుజామున 5-6 గంటల సమయంలో ‘మీ స్థానం తొలగించబడింది’ అంటూ ఈమెయిల్స్ వచ్చాయని, వెంటనే ఇంటర్నర్ సిస్టమ్స్ యాక్సెస్‌ను కూడా రద్దు చేశారని బాధితులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థలో 20 ఏళ్లకు పైగా పనిచేస్తున్న వారికి కూడా ఈ ఉద్వాసన తప్పలేదు.
కాగా ఈ ఉద్యోగుల తొలగింపు ప్రభావం కేవలం అమెరికాకే పరిమితం కాకుండా భారత్, మెక్సికో వంటి దేశాల్లోని టీమ్‌లపై కూడా పడనుందని నివేదికలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఒరాకిల్‌లో 1.62లక్షల మంది ఉద్యోగులు ఉండగా సంస్థ తాజా నిర్ణయంతో సుమారు 18 శాతం మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేసే వారు ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రాధాన్యత లేని రంగాల్లో ఖర్చు తగ్గించి ఏఐ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాలని ఒరాకిల్ భావిస్తోంది.




