27 May, 2026 | 2:04 AM

జాగ్రత్తలతోనే కీళ్లు, మోకాళ్లు, నడుం నొప్పులకు దూరం

27-05-2026 12:17 AM

హెల్త్‌టాక్‌లో కరీంనగర్ మెడికవర్ వైద్యుల సూచన

కరీంనగర్, మే 26(విజయక్రాంతి): శారీరక శ్రమ, సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పు వంటి జాగ్రత్తలతోనే కీళ్లు, మోకాళ్లు, నడుం నొప్పులను దరిచేరకుండా చేయవచ్చని మెడికవర్ వైద్యులు సూచించారు. కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవా రం కట్టరాంపూర్లోని గిద్దెపెరుమాండ్ల టెంపుల్ మైదానంలో హెల్త్‌టాక్, వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ సందర్బంగా  ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాకేష్, న్యూరోసర్జన్ డాక్టర్ రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ వృద్ధులు, మహిళలు, ఉద్యోగులు, ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. శరీర బరువు నియంత్రణ, కాల్షియం అధికంగా ఉండే ఆహా రం, నిత్యవ్యాయామం ఎముకల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు.

రోడ్డు ప్రమాదాల సమయంలో తలకు, వెన్నెముకకు తగిలే గాయాలు అత్యంత ప్రమాదకరమని, గాయం అయిన తర్వాత వాంతులు, మూర్ఛ, అధిక తలనొప్పి, మాట్లాడడంలో ఇబ్బంది, చేతులు లేదా కాళ్లు సరిగా పనిచేయకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు.

అనేక మంది ప్రజలు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయ డం లేదా ఆర్థిక ఇబ్బందుల కారణంగా పరీక్షలు చేయించుకోలేకపోవడం జరుగుతుందని, అలాంటి వారికి ఈ తరహా ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సు మారు 150 మందికి పైగా రోగులకు వైద్యులు సేవలు అందించారు. రోగులకు షుగర్, బీపీ, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఉచితంగా మందులు అందించారు. కమాన్ రోడ్డులోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా... బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్రాంచ్ మేనేజర్ జయ ప్రకాశ్, ఆపరేషన్ మేనేజర్ ఎం.రవి, ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, అబ్దుల్ వకీల్, శ్రీకాంత్, మనోజ్ పాల్గొన్నారు.