03-12-2025 12:48:13 AM
-మహేశ్వరంలో ఏటా 300 వరకు వీబీఏటీ డ్రోన్ల ఉత్పతి
-కొత్తగా 300 మందికి ఉద్యోగాలు
-దశల వారీగా ఎకో సిస్టం అభివృద్ధి
-డ్రోన్ మాన్యుఫ్యాక్చరింగ్, టెస్టింగ్ కారిడార్‌కు ప్రణాళికలు
-మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
రంగారెడ్డి,డిసెంబర్ 2( విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో రూ.850 కోట్లతో జేఎస్ డబ్ల్యూ యూఏవీ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.రాష్ట్రంలో డ్రోన్ మాన్యుఫ్యాక్చరింగ్, టెస్టింగ్ కారిడార్ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు.
మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో జేఎస్ డబ్ల్యూ, షీల్ ఏఐ సంయుక్తంగా రూ.850 కోట్లతో మహేశ్వరంలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చర్ క్లస్టర్(ఈఎంసీ)లో ఏర్పాటు చేయ నున్న ‘జేఎస్ డబ్ల్యూ అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్(యూఏవీ) ఫెసిలిటీ’ భూమి పూజ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ 16 ఎకరాల స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ఏటా 300 వరకు వీబీఏటీ డ్రోన్లు తయారవుతాయన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఇక్కడ ఉత్పత్తి మొదలవుతుందని, ప్రొడక్షన్, రీపేర్, టెస్టింగ్... ఇలా అన్ని ఒకేచోట అందుబాటులో ఉంటాయన్నారు.
కొత్తగా 300 మం దికి హైవాల్యూ ఉద్యోగాలు లభిస్తాయన్నారు. డ్రోన్లు, శాటిలైట్లు, సైబర్ సిస్టమ్స్, ఏఐ అనేవి ఇకపై భవిష్యత్తు సాంకేతికతలు కావని, అవి ఇప్పటికే ఆధునిక యుద్ధాల నిర్వహణ వ్యవస్థగా మారాయన్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రోన్ల తయారీలో స్వయం సమృద్ధిని సాధించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమన్నారు.
2030 నాటికి దేశీయ డిఫెన్స్ యూఏవీ, డ్రోన్ మార్కెట్ వాల్యూ 4.4 బిలియన్ డాలర్లు, 5 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశముందన్నారు. ఈ పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణను ‘డిఫెన్స్ స్ట్రాటజి క్ హబ్ ఆఫ్ ఇండియా’గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
అడ్వాన్స్ డ్ అన్ మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్, డిఫెన్స్ ఇన్నోవేషన్ లో రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్ గా మార్చేలా ‘ఎకోసిస్టం’ను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎల్బిట్ సిస్టమ్స్, షీబెల్ లాంటి అంతర్జాతీయ డిఫెన్స్ దిగ్గజ సంస్థల తయారీ కేంద్రాలు హైదరాబాద్ లో ఉండటం ‘రైజింగ్ తెలంగాణ’కు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో జేఎస్ డబ్ల్యూ డిఫెన్స్ ఫౌండర్ పార్థ్ జిందాల్, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.