03-12-2025 12:45:58 AM
-చేసింది, చేయబోయేది చెప్పకుండా బీఆర్‌ఎస్ పాలనపై అబద్ధాలు చెపుతారా?
-మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫైర్
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): రెండు సంవత్సరాల పాలన సంద ర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ విజయోత్సవాల ప్రారంభ సభ నిర్వహించారని, ఆ సభలో కాంగ్రెస్ చేసింది, చేయబోయేది సీఎం చెప్పుకోవాలిగానీ ఎప్పటి మాదిరిగానే కేసీఆర్‌ను తిట్టడాన్నే సీఎం రేవంత్ పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచి పనులు చేయనందునే సీఎం సభకు జనం రాలేదన్నారు. మంత్రి శ్రీహరి సభకు జనం రాకపోవడం పట్ల ఆవేదనతో మాట్లాడారని చెప్పారు. అయితే పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఏమీ చేయలేదని సీఎం పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు.
కేసీఆర్ మహబూబ్‌నగర్ ఎంపీగా చాలా చేశారని, ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఐదు జిల్లా కేంద్రాలు, ఐదు మెడికల్ కాలేజీలు ఇచ్చారని గుర్తు చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు పూర్తి చేశారని చెప్పారకు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి పది లక్షల ఎకరాలకు నీళ్లిచ్చింది కేసీఆర్ ప్రభుత్వంలో కాదా అని ప్రశ్నించారు.
ఐదు కొత్త రిజర్వాయర్లు కేసీఆర్ కట్టించారని పేర్కొన్నారు. 30 లక్షల టన్నుల వరి ధాన్యం పండించే స్థాయి నుంచి 3 కోట్ల టన్నుల స్థాయికి తీసుకెళ్లింది కేసీఆర్ కాదా అని నిలదీశారు. పది శాతం మిగిలి ఉన్న పాలమూరు రంగారెడ్డిని పనులు ఎందుకు పూర్తి చేయలేదో సీఎం రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయనందుకు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎగ్గొట్టినందుకు, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వనందుకు, రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తేనందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు.
సీఎం, మంత్రులు ఫుట్‌బాల్ ఆడ టం కాదు హామీలు అమలు చేయాలని కోరారు. హామీలు అమలు చేయకుండా కేసీఆర్, కేటీఆర్‌లను తిట్టడమే పనా అని ప్రశ్నిం చారు. మంత్రులు అవగాహనా లేకుండా మాట్లాడుతున్నారని, తమ పార్టీలో పదేళ్లు ఉండి వెళ్లిన వారు కూడా బీఆర్‌ఎస్ పాలనపై విమర్శలు చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి విజయోత్సవాల మొదటి సభ అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు.
కొడంగల్ నారాయణ్‌పేట లిఫ్ట్‌కు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శంకుస్థాపన చేశారని, మక్తల్‌లో పంచాయతీ ఎన్నికలప్పడు మరోసారి సీఎం శంకు స్థాపన చేశారని ఒకే ప్రాజెక్టుకు సీఎం రెండుసార్లు శంకుస్థాపన చేస్తారా అని ప్రశ్నించా రు. కమీషన్ల కోసమే ఈ లిఫ్టు పథకాన్ని ముందుకు తెచ్చారని ఆరోపించారు.
కేసీఆర్ ఫార్మా సిటీకి సేకరించిన 14 వేల ఎకరాలను వాడుకుని ఫ్యూచర్ సిటీ అని మభ్య పెడుతున్నారని అన్నారు. ఫ్యూచర్ సిటీని నార్త్ ఇండియా సినీ యాక్టర్లకు అప్పజెపుతున్నారని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా లో కోటి రూపాయల పనైనా చేశారా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి జోగు రామ న్న, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు సుమిత్రానంద్, సుశీలారెడ్డి పాల్గొన్నారు.