29 August, 2026 | 9:02 PM

జూబ్లీహిల్స్ పీఎస్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసు

21-05-2024 12:59 AM

బంజారాహిల్స్ పీఎస్ నుంచి మార్పు

ఏ1 నిందితుడు ప్రభాకర్‌రావు త్వరలో ఇండియాకు?

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణను బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు మార్చారు. ఈ మార్పునకు గల కారణాలపై దర్యాప్తు అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ కేసులో కీలక సమాచారాన్ని సేకరించిన అధికారులు, మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

పోలీసు అధికారులతో పాటు ప్రైవేట్ వ్యక్తులను కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో పలువురు పోలీస్ అధికారులు ప్రతిపక్ష నేతలతోపాటు వ్యాపారులు, ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీస్ అధికారులు ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావు, తిరుపతన్న, భుజంగరావును అరెస్టు చేశారు. వారు ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. 

ఇండియాకు ప్రభాకర్‌రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ౧ ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ (స్పెషల్ ఇంటెలి జెన్స్ బ్యూరో) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును ఇండియాకు తీసుకొచ్చే అంశంపై అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు రిజిస్టరైన మరుసటి రోజే ప్రభాకర్‌రావు అమెరికా వెళ్లిపోయారు. కాగా లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో పోలీసులు ఈ కేసు విచారణను వేగవంతం చేశారు. ప్రభాకర్‌రావుతోపాటు ఈ కేసులో ఏ6 గా ఉన్న ఓ ఛానల్ ఎండీ శ్రవణ్‌కుమార్ విచారణ కూడా ఈ కేసులో కీలకంగా మారనుంది.

దీంతో వీరిని భారత్‌కు తీసుకొచ్చే చర్యలు వేగవంతం చేశారు. వీరిపై ఇప్పటికే నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రెడ్‌కార్నర్ నోటీసులు జారీచేసే ప్రక్రియలో భాగంగా సీఆర్పీసీ సెక్షన్ 73 కింద సంబంధిత సమాచారం ఇప్పటికే ఇంటర్‌పోల్‌కు అందించారు. ప్రభాకర్‌రావు కుటుంబసభ్యులు పోలీస్ అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తి కాకముందే ప్రభాకర్‌రావు ఇండియాకు వచ్చే అవకాశాలున్నాయి.