200 కోట్ల టోకరా
శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ ఘరానా మోసం
అధికవడ్డీ ఆశచూపి ౫౧౭ మందికి కుచ్చుటోపీ
పరారీలో నిందితులు.. ఆందోళనలో బాధితులు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (విజయక్రాంతి): సామాన్యుల ఆశలను ఆసరాగా చేసుకుని కోట్లు కొల్ల గొడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఒకవైపు సైబర్ నేరాలు, మరోవైపు చిట్‌ఫండ్ నేరాలతో ప్రజలు నిండా మునుగుతున్నారు. ఇలాంటి మోసాలపై పోలీసులు తరచుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా నిత్యం ఎక్కడో ఒకచోట మోసాలు వెలుగుచూస్తునే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో ఘరానా మోసం బయటపడింది. అధిక వడ్డీ ఆశ చూపి రూ.200 కోట్లతో ఉడాయించింది ఓ కుటుంబం. ఈ ఘటన అబిడ్స్‌లో సోమవారం జరిగింది.
కృష్ణా జిల్లాకు చెందిన నిమ్మగడ్డ వాణిబాల, నేతాజీ దంపతులు సైదాబాద్‌లో నివాసముంటున్నారు. అబిడ్స్‌లోని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల బ్యాంక్‌లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చే వినియోగదారులను ఆకర్షించి, అధిక వడ్డీ ఆశచూపి బ్యాంకుకు సమీపంలోనే ఉన్న తన భర్త మేక నేతాజీకి చెందిన శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌లో డిపాజిట్లు చేయించింది. అలా ౫౧౭ మంది నుంచి సుమారు రూ.200 కోట్లు వసూలు చేసినట్టు తెలిసింది. చాలామంది టెస్కాబ్ అధికారులు, పలు జిల్లాల డీసీసీబీల సిబ్బంది శ్రీ ప్రియాం క ఎంటర్‌ప్రైజెస్‌లో డబ్బు దాచినట్టు సమాచారం.
ఈ డిపాజిట్లపై 15 శాతం వడ్డీ ఇచ్చేవిధంగా ఒప్పందాలు చేసుకున్నారు. ఇలా 20 ఏండ్లపాటు వడ్డీలు చెల్లిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను పెంచుకున్నారు. బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆదాయపన్ను శాఖకు లెక్కలు చూపాలి. శ్రీప్రియాంక సంస్థలో అయితే లెక్కలు చూపే అవసరం లేదని చాలా మంది లక్షలు, కోట్లలోనూ డిపాజిట్లు చేశారు. కరోనాకు ముందు వడ్డీలన్నీ నగదు రూపంలోనే చెల్లింపులు జరిగాయని, కరోనా తర్వాత అందరికీ ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేస్తున్నారని బాధితులు తెలిపారు.
ఫాక్టరీలో వచ్చే ఆదాయంతో వడ్డీలు చెల్లిస్తామని..
ఇంత భారీగా డిపాజిట్లు సేకరిస్తున్న శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ ఏం వ్యాపారం చేసి డబ్బులు ఇస్తారంటూ పలువురు ప్రశ్నించగా, తమకు జీడిమెట్ల, బెంగళూరులో ఫ్యాక్టరీలున్నాయని, భూములు కూడా కొనుగోలు చేశామని, వాటి క్రయ విక్రయాల్లో వచ్చే లాభాలతో ఈజీగా వడ్డీలిస్తున్నామని నమ్మించారు. దీంతో రూ.50 లక్షలు, రూ.2 కోట్లు కూడా డిపాజిట్ చేసిన వాళ్లు ఉన్నారని సమాచారం.
కాగా గత నవంబర్, డిసెంబర్ నుంచి వడ్డీలు సరిగా చెల్లించడం లేదని బాధితులు తెలిపారు. టెస్కాబ్‌లో పనిచేస్తున్న వాణిబాల మరో మూడు నెలల్లో పదవీ విరమణ పొందనుండగా ఇటీవల హఠాత్తుగా ఆమె దీర్ఘకాలిక సెలవుపై వెళ్లింది. ఆ వెంటనే కొన్ని రోజులకు ఫైనాన్స్ కంపెనీ మూతబడింది. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు గగ్గోలు పెడుతున్నారు. బషీర్‌బాగ్ లోని హైదరాబాద్ సీసీఎస్ పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.






