calender_icon.png 3 December, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ విజయమే ప్రజాపాలన ప్రభుత్వానికి రెఫరండం

03-12-2025 12:17:23 AM

  1. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి

సీఎం సభ ఏర్పాట్ల పర్యవేక్షణ

పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

ఆదిలాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి) :  తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వ రెండేళ్ల పాలనకు ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయమే రెఫరండమని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూప్లలి కృష్ణారావు అన్నారు. ప్రజా పాలన ప్రభుత్వ విజయోత్సవ సభను విజయవంతం చేసేందుకు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మంగళవారం జిల్లాకు చేరుకున్న మంత్రికి జిల్లా నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఈనెల 4వ తేదీన ఆదిలాబాద్ లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం సభ నిర్వహించే ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకు చేరుకున్న మంత్రి అక్కడ సభ జరిగే ఏర్పాట్లను జిల్లా నేతలతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం స్థానికంగా నిర్వహించిన పార్టీ శ్రేణుల సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొని సీఎం సభ విజయ వంతానికి చేపట్టాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు.

అలాగే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్దుల గెలుపుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ... ఈనెల 4వ తేదీన ఆదిలాబాద్ లో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో సుమారు 500 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు వెల్లడించారు. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయం కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అని, ప్రజలు ఎవరి వైపు ఉన్నారో ప్రతిపక్షాలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్ రావు ఆరోపణలకు ఆ ఎన్నికల విజయమే సమాధానం చెప్పిందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అసత్య ఆరోపణలు చేసినప్పటికీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపు ఉన్నారని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్ల కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలైందని ఆరోపించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అప్పు మాజీ సీఎం కేసీఆర్ చేశారని విమర్శించారు. కేసీఆర్ పాలన పుణ్యమా అని నేడు నెలకు కోట్ల రూపాయల వడ్డీని కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఎంత అప్పు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. 

ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లపూల నర్సయ్య, మాజీ కేంద్ర మంత్రి  వేణుగోపాల చారి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్, నిర్మల్ అసెంబ్లీ ఇంచార్జీలు కంది శ్రీనివాస రెడ్డి , ఆడె గజేందర్, శ్యాంనాయక్, శ్రీహరి రావు, నాయకులు గండ్రత్ సుజాత, ముడుపు దామోదర్ రెడ్డి, సాజిద్ ఖాన్, గోక గణేష్ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి,  మంచికట్ల అశమ్మ, యువజన కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.