దూకుడే మంత్రం
తెలంగాణలో బీజేపీ పుంజుకోవడంలో కీలక పాత్ర
అనుక్షణం పోరాటం..
అధిష్ఠానానికి నమ్మిన బంటుగా ఉంటూ..
కార్పొరేటర్ నుంచి
కేంద్ర మంత్రి స్థాయికి
ఉన్నత శిఖరాలకు బండి సంజయ్
బీజేపీ పేరు చెప్పగానే మొదట గుర్తుకొచ్చేది బండి సంజయ్. కరీంనగర్ జిల్లాకు చెందిన బండి సంజయ్‌కుమార్ గడిచిన ఐదేళ్లలో పార్టీని పట్టణం నుంచి పల్లెకు పాకించారు. విద్యార్థి దశ నుంచే పోరాటాల పటిమను పుణికి పుచ్చుకున్న బండి తన గళంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ పటిష్టతకు కృషి చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు సాగించారు. ప్రజాసంగ్రామ యాత్రతో అధికార పార్టీపై యుద్ధం చేశారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించిన బండికి అధిష్ఠానం మంత్రి పదవితో తగిన గుర్తింపునిచ్చింది.
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): శిశు మందిర్ విద్యార్థి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదగడం చూస్తే బండి సంజయ్‌కుమార్‌కు ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధత ఏంటో అర్థం అవుతుంది. అనుక్షణం దూకుడుగా ఉండటమే కాకుండా రాజకీయాల్లో పోరాటమే ఊపిరిగా అన్నట్లుగా కష్టపడిన బండి సంజయ్.. చివరకు కేంద్రమంత్రి పదవికి ఎంపికయ్యారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కారులో మిత్రపక్షాలకు సైతం మంత్రి పదవులు ఇవ్వాల్సిన పరిస్థితులు, సందిగ్ద్ధావస్థలోనూ బండికి మినిస్టర్ పోస్ట్ వచ్చిందంటే.. కష్టపడే కార్యకర్తకు దక్కిన గౌరవంగా అందరూ పేర్కొంటున్నారు.
బీజేపీలో సామాన్యుడు సైతం కేంద్ర మంత్రి అవుతారని బండి నిరూపించారు. పార్టీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యున్నత స్థాయికి ఎదిగారాయన. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ చేసిన పోరాటం సామాన్యమైనది కాదు. ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ సర్కారుపై అత్యంత దూకుడుగా ఉద్యమం చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా చెదరని చిరునవ్వుతో, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో పోరాడారు. రాజకీయంగా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కుని ముందుకు సాగారు. అందరూ కలిసి ఎమ్మెల్యేగా ఓడించినా బెదిరిపోలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటమే ఊపిరిగా నిలిచారు.
రెండోసారి ఎంపీగా ఎన్నికవ్వడమే కాకుండా కేంద్ర మంత్రి పదవిని చేజిక్కించుకుని ప్రజలకు మరింత సేవలు చేసేందుకు సిద్ధమయ్యారు. దూకుడే మంత్రంగా అనుక్షణం పోరాడినందునే బండి ఈ స్థాయికి చేరుకున్నారు. కార్యకర్తలు పిలిస్తే పలికే వ్యక్తిగా పేరున్న బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి రావడంతో తెలంగాణ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి స్థాయికి చేరుకోవడం సాధారణ విషయం కాదు. అయితే అది కేవలం బీజేపీ వల్లే సాధ్యమని బండి పేర్కొనడం చూస్తే పార్టీ పట్ల ఆయనకున్న విధేయతే ఆయనను ఈ స్థాయికి తీసుకువచ్చిందని పార్టీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు.
పట్టణం నుంచి పల్లెకు పార్టీ విస్తరణ
బీజేపీ అంటేనే నగరాలు, పట్టణాలకు మాత్రమే పరిమితమైన పార్టీగా గుర్తింపు ఉండేది. బీజేపీకి గ్రామాల్లో ఆదరణ ఉండదనే విధంగా పరిస్థితులుండేవి. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడయ్యాక పార్టీ స్వరూపమే మారిపోయింది. రాష్ట్రంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అత్యంత దూకుడుగా వ్యవహరిండమే కాకుండా అవినీతి, అక్రమాలపై నిత్యం పోరాటం కొనసాగించారు. ప్రజాసంగ్రామ యాత్రతో 1600 కి.మీ.కుపైగా పాదయాత్ర చేసి కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచారు. కేసీఆర్ పాలన అంతానికి బండి సంజయ్ పాదయాత్రతోనే అడుగులు పడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆనాడు గొంతెత్తి ప్రశ్నించడానికే వీల్లేకుండా నిరసనలపై ఉక్కుపాదం మోపిన కేసీఆర్ సర్కార్‌పై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఉద్యమాలు చేసేందుకు వెనుకాడిన సమయంలో బీజేపీ రాష్ర్ట రథసారథిగా కార్యకర్తలందరినీ ఏకం చేసి రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళల సమస్యలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలు ఎదుర్కొంటున్న కష్టాలపై అడుగడుగునా పోరాటాలు చేసి బీజేపీని ఇంటింటికీ పరిచయం చేసిన ఘనత బండి సంజయ్‌దే. గత ఐదేళ్లపాటు కుటుంబానికి దూరమై బండి సంజయ్ చేసిన పోరాటాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, కార్యకర్తల కోసం ఎంతవరకైనా తెగించే మనస్తత్వం బండి సంజయ్ సొంతం. నిరంతరం ప్రజల్లో ఉండటం, నిత్యం కార్యకర్తలతో కలిసి నడవడం బండి ప్రత్యేకత. ఎంపీగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ లాఠీఛార్జీలు, కేసులు, అరెస్టులకు లెక్క చేయని చరిత్ర సంజయ్‌ది.
రాళ్లదాడులకు వెరవని నైజం
రైతులకు భరోసా ఇచ్చేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్దకు వెళుతుంటే నాటి అధికార బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు రాళ్ల దాడికి తెగబడినా వెనుకంజ వేయకుండా దీటుగా ఎదుర్కొని రైతులకు అండగా నిలిచారు బండి సంజయ్. రైతుల కోసం ఆయన చేసిన పోరాటానికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే. నిరుద్యోగ మార్చ్ పేరుతో జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలతో నిరుద్యోగుల పక్షాన పోరాడారు. బండి పోరాటాలతో బెంబేలెత్తిన నాటి కేసీఆర్ సర్కార్ టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో అర్ధరాత్రి పోలీసులను ఇంటికి పంపి అక్రమంగా అరెస్ట్ చేయించింది.
అరెస్టులకు ఏమాత్రం వెరవకుండా ఉద్యమించి కాషాయ పార్టీ పోరాట పటిమను చాటి చెప్పారు. 317 జీవోను సవరించాలని ఉద్యోగుల పక్షాన పోరాడి సర్కార్‌ను గడగడలాడించిన ఘనత కూడా సంజయ్‌దే. ఆయన ధాటికి తట్టుకోలేని నాటి పాలకులు కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో దీక్ష చేస్తుండగా పోలీసులను పంపి గ్యాస్ కట్టర్లతో ఆఫీస్ గేట్లను ధ్వంసం చేయించి అరెస్ట్ చేసి... భవిష్యత్తులో దీక్షలు చేయకుండా బీజేపీని కట్టడి చేయాలని చూశారు.
అయినా ఏమాత్రం లెక్కచేయకుండా సంజయ్ కేసీఆర్ సర్కార్‌పై అలుపెరగని పోరాటాలు చేసి నాటి ప్రభుత్వ పతనంలో అత్యంత చురుకైన పాత్ర పోషించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ ఎంపీగా కొనసాగుతూ ప్రజా సమస్యలపై పోరాడి రెండుసార్లు జైలుకు వెళ్లిన ఘనత కూడా సంజయ్‌దే. ప్రజల కోసం, కార్యకర్తల కోసం కొట్లాడి అనేక కేసులు ఎదుర్కొంటున్న ఎంపీ కూడా ఆయనే.
అధ్యక్ష మార్పు.. అధికారానికి దూరంగా బీజేపీ..
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్‌ను అనూహ్యంగా బీజేపీ రాష్ర్ట అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించడం రాష్ర్టంలో ఆ పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకున్న అతి పెద్ద పొరపాటుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ నిర్ణయంతో కార్యకర్తలు, పార్టీ నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. బండి సంజయ్ రాష్ర్ట అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రాష్ర్టంలో బీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అనే స్థాయికి తీసుకెళ్లారు. అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలంటేనే బండి సంజయ్ అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితి ఉండేది. బండి వస్తున్నాడంటే చాలు కార్యకర్తలకు ఎక్కడ లేని జోష్ వచ్చేది.
కానీ ఆయన్ను అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించిన ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లను సాధించలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ర్ట అధ్యక్ష పదవి నుండి తప్పించాక జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి ఉన్నత పదవిని కట్టబెట్టినప్పటికీ కార్యకర్తల్లో అసంతృప్తి తగ్గలేదు. ఇప్పుడు అందుకే బండికి కేంద్ర మంత్రి పదవి దక్కగానే బీజేపీలో కష్టపడే కార్యకర్తలంతా తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. సంబురాలు చేసుకుంటున్నారు. నిరంతరం ప్రజల కోసం తపించే బండి సంజయ్‌కు కేంద్రంలో ఏ శాఖ అప్పగించినా ఆ శాఖను సమర్ధవంతంగా నిర్వర్తించడంతోపాటు ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
బండికి కేంద్ర మంత్రి పదవి కార్యకర్తల్లో హర్షాతిరేకాలు
బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వగానే రాష్ట్ర బీజేపీకి కొత్త ఊపు వచ్చింది. బండిని తెలంగాణ కాషాయ దళపతిగా పిలుచుకునే బీజేపీ కార్యకర్తల ఆనందానికి ఆవధుల్లేకుండాపోయాయి. పార్టీలో సాధారణ కార్యకర్తగా తన ప్రస్థానం మొదలుపెట్టి నేడు కేంద్ర మంత్రి స్థాయికి చేరడం చూసి కార్యకర్తలు తమకే పదవి వచ్చిందన్నంతగా సంబరపడుతున్నారు. ఆయనకు పదవి ఇవ్వడం సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగా వారు భావిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీని ఓ స్థాయికి తీసుకువచ్చిన బండి ఇప్పుడు కేంద్ర మంత్రిగా పార్టీకి, రాష్ట్రానికి మరింత సేవ చేస్తారని పార్టీ నాయకులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి లభించడంపట్ల కరీంనగర్ పార్లమెంట్ ప్రజల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి.
ప్రొఫైల్
పుట్టిన తేదీ : 11.07.1971
తల్లితండ్రులు : కీ.శే. బండి నర్సయ్య, శకుంతల
సోదరులు : బండి శ్రవణ్‌కుమార్, బండి సంపత్ కుమార్
అక్క : శైలజ
భార్య : బండి అపర్ణ (ఎస్‌బీఐ ఉద్యోగి)
పిల్లలు : సాయి భగీరథ్ (బీటెక్), సాయి సుముఖ్ (9వ తరగతి)
హాబీలు : క్రికెట్ ఆడటం, చూడటం, పాటల పాడటం,
కుటుంబంతో కలిసి కొత్త ప్రదేశాల వీక్షణం
కుల : మున్నూరు కాపు (బీసీ-డి)
అలంకరించిన పదవులు..
బాల్య స్వయం సేవక్‌గా ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేశారు.
ఏబీవీపీ కరీంనగర్ టౌన్ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు,
కరీంనగర్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో డైరెక్టర్(1994-1999, 1999-2003),
జాతీయ కార్యాలయం (ఢిల్లీ)లో ఎన్నికల ప్రచార ఇన్‌చార్జి,
బీజేపీ యువ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, బీజేవైఎం పట్టణ అధ్యక్షునిగా,
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా,
జాతీయ కార్యవర్గ సభ్యునిగా, జాతీయ కార్యదర్శి, కేరళ, తమిళనాడు ఇన్‌చార్జిగా,
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, అద్వానీ సురాజ్ రథయాత్ర వెహికిల్ ఇన్‌చార్జిగా,
కరీంనగర్ 48వ డివిజన్ కార్పొరేటర్‌గా, కరీంనగర్ నగర బీజేపీ అధ్యక్షునిగా,
బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు.
రెండు సార్లు కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
2019లో కరీంనగర్ ఎమ్మెల్యేగా ఓటమి
2019లో కరీంనగర్ నుంచి ఎంపీగా 96 వేల ఓట్లతో తేడాతో ఘన విజయం..
2019 ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడు, అర్బన్ డెవలప్‌మెంట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడు, టొబాకో బోర్డు సభ్యుడు, మైనారిటీ అఫైర్స్ స్టేట్ లెవల్ కమిటీ సభ్యుడు,
2020 ఎయిమ్స్ బీబీ నగర్ బోర్డు సభ్యుడు,
2020 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
2023 బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
2023 కరీంనగర్ ఎమ్మెల్యేగా మరోసారి ఓటమి
2024 జాతీయ కిసాన్ మోర్చా ఇన్‌చార్జిగా నియామకం
2024 కరీంనగర్ ఎంపీగా 2.25 లక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం
జూన్ 9, 2024- కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం.
చెన్నమనేని తర్వాత బండికే!
కరీంనగర్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌కు కేంద్ర మంత్రి పదవి దక్కడం పట్ల తెలంగాణలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ కాషాయ దళపతిగా పిలుచుకునే బండికి మంత్రి పదవి దక్కడంతో కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు.
బీజేపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న కరీంనగర్ ఎంపీల్లో రెండో వ్యక్తిగా బండి నిలిచారు. 1998 మాజీ గవర్నర్, అప్పటి ఎంపీ చెన్నమనేని విద్యాసాగర్‌రావు వాజ్‌పేయీ హయాంలో మంత్రిగా పనిచేశారు. చెన్నమనేనికి కరీంనగర్ ప్రాంతంలో మంచి పలుకుబడి ఉంది. ఇప్పటికే పలు గ్రామాల్లో చెన్నమనేని పేరిట అభివృద్ధి పనులు కనిపిస్తాయి. ఆ తర్వాత మరోసారి బీజేపీ నుంచి బండి సంజయ్‌కు మంత్రి పదవి దక్కింది. 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు మోదీ కేబినేట్‌లో బండికి చోటు దక్కడం విశేషం.
మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడినా..
బండి సంజయ్ రాజకీయ జీవితమంతా ఆటుపోట్లమయమే. కరీంనగర్‌లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బండి సంజయ్ సామాన్య బీజేపీ కార్యకర్తగా ప్రస్తానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. రెండు సార్లు కార్పొరేటర్‌గా గెలిచిన బండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. కరీంనగర్ పట్టణంలో ముస్లిం ప్రజలు నివసించే ప్రాంతంలో గంపగుత్తగా బండికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నప్పటికీ ఆయన ఏనాడూ బీజేపీని, హిందుత్వ భావజాలాన్ని వీడలేదు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని నరనరాన పుణికిపుచ్చుకున్న సంజయ్ ఓట్ల కోసం, పదవుల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం సిద్ధాంతాన్ని ఏనాడూ పక్కన పెట్టలేదు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, మరెన్ని అవమానాలు ఎదురైనా అధిగమిస్తూ ముందుకు సాగారు. అందుకే బీజేపీలో కార్యకర్తలందరికీ బండి సంజయ్ ‘హిందుత్వ ఐకాన్’ గా మారారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 96 వేల ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఆ తరువాత బీజేపీ రాష్ర్ట పగ్గాలు చేపట్టి రాష్ర్టమంతా సుడిగాలి పర్యటనలతో ప్రజా సమస్యలపై అలుపెరగని ఉద్యమాలు చేస్తూ పార్టీని రాష్ర్టవాప్తంగా బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా 2.25 లక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి నేరుగా కేంద్ర మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నారు.
రాష్ట్ర ప్రగతికి తోడ్పడుతా..
కార్యకర్తల కృషి ఫలితమే ఈ పదవి
ప్రజల నమ్మకాన్ని నిలబెడతా
కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్, జూన్ ౯ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రగతికి, కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఓ ప్రకటన విడుదల చేశారు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజల వల్లే తనకు కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం లభించిందని, ఎల్లప్పుడూ కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. తనకు లభించిన పదవి పార్టీ కార్యకర్తల కృషి ఫలితమేనని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని తాను కోరుకునేది ఒక్కటేనని.. వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలను పక్కనబెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు. కేంద్ర మంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అలాగే తెలంగాణ ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి, జాతీయ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.






