12 July, 2026 | 1:38 PM

ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే వ్యాపారి కిడ్నాప్

10-06-2024 01:26 AM

వివరాలు వెల్లడించిన ఏసీపీ రమణ గౌడ్

రాజేంద్రనగర్, జూన్ 9: ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే నార్సింగ్ ప్రాంతంలో శేషువర్ధన్‌రెడ్డి కిడ్నాప్ జరిగిందని, వ్యాపారిని కాపాడి ప్రమాదం నుంచి బయటకు తీసుకువచ్చామని ఏసీపీ రమణ గౌడ్ తెలిపారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఆయన ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డితో కలిసి వివరాలను వెల్లడించారు. ఏపీలోని కర్నూల్ జిల్లా నందికోట్కూరుకు చెందిన శేషు వర్ధన్‌రెడ్డి, భార్య అరుణతో కలిసి హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు.

శేషువర్ధన్‌రెడ్డికి కొద్దిరోజులుగా ఇదే జిల్లా ఎన్‌ఆర్ పేటకు చెందిన అందె క్రాంతితో రూ.2.5 కోట్ల ఆర్థిక లావాదేవీల విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఎలాగైనా డబ్బులను శేషువర్ధన్‌రెడ్డి నుంచి సొమ్ము తీసుకోవాలనే ఉద్దేశంతో క్రాంతి తన స్నేహితుడు కల్లెపు సందీప్‌తో కలిసి కిడ్నాప్‌కు ప్లాన్ చేశాడు. ఈ నెల 8న రాత్రి 9 గంటల ప్రాంతంలో నార్సింగి ప్రాంతంలో ఉన్న శేషువర్ధన్‌రెడ్డిని బెదిరించి క్రాంతి, సందీప్ కిడ్నాప్ కారు తరలించారు. శేషువర్ధన్‌రెడ్డి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. కంట్రోల్ రూమ్స్, ఇంటర్ స్టేట్ పోలీసులు, చెక్ పోస్ట్‌లను అప్రమత్తం చేశారు. కారు కర్నూల్ జిల్లా వైపు వెళ్తున్నట్లు గుర్తించి ఛేజ్ చేసి మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులలో స్థానిక పోలీసుల సాయంతో అడ్డుకున్నారు. క్రాంతి, సందీప్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన సిబ్బందిని ఏసీపీ అభినందించారు.