చినుకు పడితే రోడ్లు చిత్తడే
రహదారిపై గుంతలు.. వర్షం నీరు నిలిచి ప్రయాణంలో ప్రమాదం
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో చినుకు పడితే రోడ్డులు చిత్తడిగా మారుతున్నాయి.. రోడ్లపై పడిన గుంతలలో వర్షం నీరు నిలిచి ఆటోలు, బైక్ లపై ప్రయాణించే ప్రయాణికులు ప్రమాదానికి గురి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏజెన్సీలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల పరిధిలోని ప్రధాన రోడ్డులు వర్షానికి చిత్తడి కావడంతో పాటు మారుమూల గ్రామానికి వేసిన మట్టి రోడ్డులు రాకపోకలకు సాగకుండా బురదమయం అయ్యాయి. గత రెండు రోజులుగా ముసురు వర్షం కురవడంతో ఏజెన్సీలోని గిరిజన గ్రామాల ప్రజలు బయట ప్రపంచానికి వచ్చేందుకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.






