లక్ష్యానికి ఈవల.. ఇందిరమ్మ ఇళ్లు
సర్కార్ ఆశించినమేర సాగని నిర్మాణం
- మార్చి చివరినాటికి లక్ష ఇళ్లు పూర్తిచేయాలనే లక్ష్యం
- ఇప్పటివరకు పూర్తయినవి 22,500 మాత్రమే
- స్లాబ్ పడినవి 1.12 లక్షలు, బేస్‌మెంట్ లెవల్‌లో 60,192 గోడలవరకు పూర్తయినవి 34,388
- ఇంకా మొదలుకానివి 58 వేలకు పైనే
హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం క్షేత్రస్థాయిలో ఆశించినమేర సాగడం లేదు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యానికి ఇళ్ల నిర్మాణం ఆమడదూరంలో కనిపిస్తోంది. మార్చి నెలఖారు లో లక్ష ఇళ్లు, జూన్ ఆఖరువరకు మరో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే మార్చి నెల దాటి ఏప్రిల్ మొదటివారం ముగిసినా 22,500 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.
ఇండ్ల నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించి 9 నెలలు పూర్తికావొస్తున్నా.. పురోగతి మాత్రం కనిపించడం లేదు. ఒకవైపు స్టీల్, సిమెంట్ ధరలు పెరగడం, మరో వైపు సర్కార్ పెట్టిన కోర్రీలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నత్తనడకకు కారణాలయ్యాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకు న్నది.
గ్రేటర్ హైదరాబాద్ మినహా 32 జిల్లాలకు 3,68,540 ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 3,24,733 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరుచేసినప్పటికి 2,66,742 మంది లబ్ధ్దిదారులు మాత్రమే ఇంటి నిర్మాణం పనులను ప్రారంభించారు. ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున ప్రభుత్వం సాయంచేస్తున్న విషయం తెలిసిందే. ఇంటి నిర్మాణం దశలను బట్టి ప్రతి సోమవారం బిల్లులను చెల్లిస్తున్నది. ఇళ్ల నిర్మాణం పూర్తిచేసిన లబ్ధ్దిదారులకు ప్రభు త్వం రూ. 5 లక్షల చొప్పున చెల్లించింది.
ఇప్పటివరకు వివిధ దశల్లో నిర్మాణమైన ఇళ్లకు రూ. 5,382.18 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం అందించే సాయంతో ఇళ్లు పూర్తయ్యే పరిస్థితులు లేకపోవడంతో లబ్ధిదారులు అదన ంగా అదనంగా డబ్బులు సమకూర్చుకుని ఇంటి నిర్మాణం చేపట్టుకుంటున్నారు.
ఆర్థికంగా మరింతగా ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారుల ఇళ్లు మధ్యలోనే నిలిచిపోతున్నాయని చెబుతున్నారు. పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లకు.. లబ్ధిదారులు గృహప్రవేశాలు కూడా చేసుకుంటున్నారు. అయితే ఇంకా 58 వేలకు పైగా ఇళ్లు లబ్ధిదారులు మొదలుపెట్టాల్సి ఉందని తెలుస్తోంది.
కొర్రీలతోనూ ఆలస్యమే..
ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల చొప్పున నాలుగు విడతల్లో బిల్లులను విడుదల చేస్తున్నది. మొదటి విడతర బేస్‌మెంట్‌కు రూ. 1 లక్ష, గోడల వరకు రూ. 1 లక్ష, స్లాబ్ వేశాక రూ. 1.40 లక్షలు, మిగతా డబ్బులు గోడలకు ప్లాస్టరింగ్, ఇంటి లో బండలు, సున్నంతో పాటు కరెంట్ పను లు, బాత్రూమ్ నిర్మాణం పూర్తయిన తర్వాత బిల్లులు విడుడదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అధికారులు కూడా ఆ విధంగానే వ్యవహరించారు.
ఇక బత్రూమ్ నిర్మాణానికి సం బంధించి రూ. 60 జాతీయ ఉపాధి పథకం నిధుల నుంచి విడుదల చేస్తున్నారు. అయితే లబ్ధిదారుడు ఇంటి స్లాబ్‌వరకు అప్పో, సప్పో చేసి నెట్టుకొస్తున్నప్పటికి.. మిగతా పనులు పూర్తిచేయడానికి వెనకడుగువేస్తున్నారని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఈ విషయాన్ని గమనించిన ప్రభు త్వం గోడలకు ప్లాస్టరింగ్, బయట గోడలకు పెయింట్‌తో పాటు ముందు డోర్లు బిగించిన వారికి బిల్లులు ఇవ్వాలని ఇటీవలనే సడలింపులు ఇచ్చింది. విద్యుత్ ఫిటింగ్ లబ్ధిదారుడి స్థోమతను బట్టి మిగతా పనులు చూసుకునే విధంగా వెసులుబాటు కల్పించిందని, ఇక నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణం మరింత స్పీడ్ పెరుగుతుందని ఒక ఉన్నతాధికారి తెలిపారు.
లబ్ధిదారులపై ధరల భారం..
స్టీల్, సిమెంట్ ధరలు అధికంగా పెరగడంతో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడికి అదనపు భారం తప్పడం లేదు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంబించిన సమయంలో క్వింటాల్ స్టీల్ ధర వివిధ కంపెనీల బట్టి రూ. 5,200 నుంచి రూ. 5,400 వరకు ఉండేది. ఇప్పుడు అదే స్టీల్ ధర క్వింటాకు రూ. 6,300 వరకు పెరిగింది. అదనంగా క్వింటా స్టీల్‌కు రూ. వెయ్యి వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాకి ప్రభుత్వం నిర్ణయించిన కొలతల ప్రకారం ఒక్కో ఇంటికి 25 క్వింటాళ్ల నుంచి 30 క్వింటాళ్ల వరకు స్టీల్ అవసరం పడుతుంది.
క్వింటా స్టీల్‌కు రూ. వెయ్యి పెరిగడంతో.. లబ్ధ్దిదారుడికి స్టీప్ పేరుమీద అదనంగా రూ. 25 నుంచి 30 వేల వరకు భారం పడుతోంది. ఇక సిమెంట్ ధరలు.. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభ సమయంలో ఒక బస్తాకు రూ. 290 ఉంటే, ఇప్పుడు రూ. 315 వరకు పెరిగింది. దీంతో ఇంటి నిర్మాణానికి సుమారుగా 300 బస్తాలకు పైగా సిమెంట్ పడుతున్నదని, పెరిగిన ధరతో అదనంగా లబ్ధ్దిదారుడిపై రూ.5 వేల భారంపడుతోంది.
స్థానికంగా ఉండే వాగుల నుంచి ఇసుక తీసుకుంటే కొంత మేర లాభం జరుగుతోంది. నదుల ఇసుకతో ఇంటి నిర్మిస్తే అదనంగా భారం మోయాల్సి వస్తుంది. ప్రభుత్వం స్టీల్, సిమెంట్ ధరలను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికి.. ఆచరణలో అది సాధ్యంకాలేదని, అందుకు అదంగా ఆర్థిక భారం పడిందని చెబుతున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల వివరాలు..
కేటాయింపు 3,68, 540
మంజూరు 3,24,733
ప్రారంభం 2, 66, 742
బేస్‌మెంట్ 60,192
గోడల వరకు 34,388
స్లాబ్ లెవల్ 1,12,127
పూర్తయినవి 22,500




