29 April, 2026 | 3:24 AM

త్వరలో కడ్తాల్ బీసీ సంక్షేమ సంఘ ఎన్నికలు

29-04-2026 01:00 AM
  1. మే 9న ఎంబీఏ గార్డెన్‌లో కీలక సమావేశం
  2. యువజన, సంక్షేమ సంఘాలకు వేర్వేరు ఎన్నికలు

కడ్తాల్, ఏప్రిల్ 28, (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కడ్తాల్ బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికల కోసం సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి.మే 09న శనివారం ఎంబీఏ గార్డెన్స్లో నిర్వహించే సమావేశంలో సంఘానికి కొత్త అధ్యక్షుడు, కార్యవర్గాన్ని ఎన్నిక చేయనున్నట్లు సంఘం అధ్యక్షుడు పిప్పల్ల వెంకటేష్ ప్రకటించారు. మంగళవారం కడ్తాల్లో బీసీ సంఘం ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా యువజన సంఘం, బీసీ సంక్షేమ సంఘానికి విడివిడిగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రజాస్వామ్య విధానంలో జరుగుతుందని తెలిపారు.

గత పదేళ్ల కాలంలో బీసీల హక్కుల సాధన కోసం పలు ఉద్యమాలు చేపట్టామని పిప్పల్ల వెంకటేష్ పేర్కొన్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగిన ఉద్యమాల్లో బీసీ నాయకులతో కలిసి చురుకుగా పాల్గొని సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు వివరించారు.కడ్తాల్ పట్టణ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘానికి ప్రత్యేక భవనం నిర్మాణం కోసం అప్పటి గ్రామపంచాయతీ పాలక మండలి మద్దతుతో సుమారు 3000 గజాల స్థలం కేటాయించడాన్ని ఆయన గుర్తుచేశారు.

ఈ భవనం నిర్మాణం ద్వారా బీసీ సమాజానికి మరింత సేవలు అందించే దిశగా ముందడుగు పడిందన్నారు. అదేవిధంగా కడ్తాల్ బస్టాండ్ సమీపంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంఘం చరిత్రలో ఒక ముఖ్య ఘట్టమని పేర్కొన్నారు. పూలే ఆశయాలను ప్రేరణగా తీసుకుని బీసీ సమాజ అభివృద్ధికి కృషి కొనసాగుతుందని తెలిపారు. ఈ ఎన్నికల సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి బీసీ సంఘ సభ్యులు, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల ద్వారా కొత్త నాయకత్వం వెలుగులోకి వచ్చి బీసీ సంక్షేమానికి మరింత ఊతమివ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల రాఘవేందర్,బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కేశని మహేష్,ప్రధాన కార్యదర్శి మూడ రవి, నాయకులు కందికంటి సుధాకర్ గౌడ్, సత్యం యాదవ్, మాలే మల్లేష్ గౌడ్, దేవేందర్ గౌడ్,మహేశ్వర్, మిర్యాణం సంతోష్ కుమార్, దోనాదుల మహేష్, క్యామ రాజేష్, భానుకిరణ్, డైరెక్టర్ చందు, చెన్నమోని కృష్ణ, బోసు రవి, చిప్ప రాజు, జగన్ యాదవ్, కేశని శంకర్, తరుణ్, సన్నీ, మాదారం మహేష్ తదితరులు పాల్గొన్నారు.