కామారెడ్డి జిల్లాలో వ్యాపారుల కక్కుర్తి
విత్తనాల కృత్రిమ కొరత
అధిక ధరలతో దోపిడీ
బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టలేని అధికారులు
సాగుబడికి ముందే రైతాంగంపై పెనుభారం
కామారెడ్డి, జూన్ 10 (విజయక్రాంతి) : రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్నవ్యాపారులు. అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇదేమని అడిగితే విత్తనాలు, ఎరువు లు స్టాకు లేవని చెప్తున్నారు. కామారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం, పెద్దకొడప్‌గల్, జుక్కల్, బిచ్కుంద మండలాలతోపాటు బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్, నస్రుల్లాబాద్, తదితర మండలాల్లో ఓ కంపెనీకి చెందిన సోయా, పత్తి విత్తనాలతో పాటు, డీఏపీ ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
రైతులను మోసంచేసే వ్యాపారుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులను డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. సదరు వ్యాపారులను నియంత్రించకపోవడం, టాస్క్‌ఫోర్స్ కమిటీలతో ఒకవైపు అకస్మిక తనిఖీలు చేయాల్సి ఉండగా, ఆదిశగా చర్యలు చేపట్టడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. అధిక ధరలపై ఫిర్యాదు చేసేందుకు అవసరమైన ఫోన్ నంబర్లను దుకాణాదారులు పేర్కొనకపోవడంతో వ్యాపారులకు అనుకూలంగా మారు తుందని ఆరోపిస్తున్నారు.
ఒరిజినల్ బిల్లులు ఇవ్వట్లే
జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం, పెద్దకొడప్‌గల్, చిన్నకొడప్‌గల్, జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ మండలాల్లో రైతులు పత్తిని ఎక్కువగా సాగుచేస్తారు. డిమాండ్ ఉన్న మూడు పత్తి విత్తనాలు అందుబాటులో లేవని చెప్తూ వ్యాపారులు బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పత్తి విత్తన ప్యాకెట్ రూ.864కే విక్రయించాలని ప్రభుత్వం నిర్దేశించినా, స్టాకు లేదు అనే సాకుతో అధిక ధరలకు రైతులకు విక్రయిస్తున్నారు. బిల్లులు కూడా ఒరిజినల్ ఇవ్వకుండా తెల్లకాగితాలపై రాసి రైతులకు ఇస్తున్నారు.
ఇది ఏమి పద్దతి అని అడిగిన రైతులకు అవసరం ఉంటే తీసుకెళ్లండి లేకుంటే లేదని వ్యాపారులు సమాధానం చెప్పుతున్నారని రైతులు ఆరోపిస్తు న్నారు. తెల్ల కాగితాలపై బిల్లులు రాసి ఇస్తూ, సరైన బిల్లు కావాలంటే అధనంగా జిఎస్‌టి కట్టాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాల్లో డిఎపి ఎరువులు అందుబాటులో లేకపోవడం వ్యాపారులకు కలిసివ స్తుంది. డిఎపి స్టాకు లేదంటూ అవసరమైన రైతులకు అధిక ధరలకు అంటగడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం తమకు ఫిర్యాదులు రాలేదని పేర్కొనడం గమనార్హం.
తనిఖీలకు వచ్చినప్పుడే అసలు బిల్లులు ఇస్తున్నారు
అధికారులు ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖి చేసేందుకు వచ్చినప్పుడు మాత్రమే వ్యాపారులు అసలు ధరను తీసుకొని, అసలు బిల్లులు ఇస్తున్నారు. ఎప్పుడు కూడా తెల్లకాగితంపైనే బిల్లు రాసి ఇస్తున్నారు. ఇదేమని అడిగిన రైతులకు స్టాకు లేదని, జిఎస్‌టి అధనంగా చెల్లించాలని వ్యాపారులు రైతులను కోరడంతో నష్టపోతున్నా కూడా ఏమి చేయలేని పరిస్థితిలో అధిక ధరలకైనా విత్తనాలను, ఎరువులను కొనుగోలు చేయాల్సి వస్తుందని అన్నారు.
- భూమాబోయి, రైతు, బిచ్కుంద మండలం, కామారెడ్డి జిల్లా
ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం
కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలలో విత్తనాలు, ఎరువుల దుకాణాలను టాస్క్‌ఫోర్స్ బృందాల ఆధ్వర్యంలో తనీఖీలు చేపట్టాం. తమకు ఫిర్యాదులు రాలేదు. నిబంధనలకు అనుగుణంగానే అమ్మకాలు జరుగుతున్నట్లు తమ తనిఖీల్లో వెల్లడైంది. అధిక ధరలకు విక్రయించినట్లు ఫిర్యాదులు వస్తే, చర్యలు తీసుకుంటాం. రైతులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే, పరిశీలించి అధిక ధరలకు విక్రయించిన వ్యాపారుల దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేస్తాం.
- భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారిణి, కామారెడ్డి






