19-07-2025 10:54:47 AM
మందమర్రి,(విజయక్రాంతి): వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నప్పటికీ వర్షాలు(Rains) కురువక పోవడంతో వర్షాలు కురిపించు వరుణ దేవుడా అని వేడుకుంటూ మండలంలోని పొన్నారం గ్రామంలో శనివారం కప్పతల్లి ఆటలు ఆడారు. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా కప్పతల్లి ఆట ఆడారు. సంచిలో కప్పలను కట్టి రోకలికి తగిలించి డప్పుచప్పుల్లతో గ్రామంలో ఇంటింటికి తిరిగారు. ఇండ్ల వద్దకు వచ్చిన వారికి ప్రతీ ఒక్కరూ బిందెలతో నీళ్లు పోస్తూ వరుణుడు కరుణించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ గతంలో వానలు కురువాలంటే పెద్దలు గ్రామాల్లో కప్పతల్లి ఆట ఆడేవారని వరుణుడు కరుణించి వర్షాలు కురిసేవని అన్నారు. అదే పద్ధతిని ఇప్పుడు పాటిస్తున్నామ న్నారు. గ్రామంలోని యువకులు చిన్నారులు కేరింతలు చేస్తూ ఉత్సాహంతో కప్ప తల్లి ఆట ఆడారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెంచాల మధు,మాసు సంతోష్ కుమార్, పెంచాల రాజలింగు, ఈద లింగయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.