9 May, 2026 | 4:04 PM

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు

09-05-2026 03:23 PM

భారత్ రాష్ట్ర సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జి.వి. రామకృష్ణారావు

మానకొండూరు,(విజయక్రాంతి): కరీంనగర్ నగర బంద్ విజయవంతం చేసిన ప్రజలకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు. ఈ మేరకు మీడియాకు ఆయన శనివారం  ప్రకటన విడుదల చేశారు. ఈ బంద్‌లో రైతులు, కార్మికులు, వివిధ వ్యాపార, ట్రేడ్ అసోసియేషన్లు, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొని తమ లావాదేవీలు, వ్యాపార కార్యకలాపాలను ఈరోజు పూర్తిగా మూసివేసి బంద్ ను విజయవంతం చేశారన్నారు.

నిన్న బంద్‌ను విఫలం చేస్తామని ధైర్యంగా ప్రకటనలు చేసిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు శనివారం ఎక్కడా కనిపించలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బంద్‌కు లభించిన అపార ప్రజా మద్దతును చూసి వారు ఖంగతిన్నారని అన్నారు. ప్రజల ముందుకు వచ్చి ముఖం చూపించే పరిస్థితి కూడా వారికి లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. బంద్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని గ్రహించి వారు బయటకు రావడానికి కూడా వెనుకంజ వేశారని విమర్శించారు.

కరీంనగర్ ప్రజలపై ఒత్తిడి తీసుకువచ్చి బంద్‌ను విఫలం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మూకుమ్మడిగా వ్యవహరించినప్పటికీ, కరీంనగర్ ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి  బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. కరీంనగర్ నగర ప్రశాంతత, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ బంద్ నిర్వహిస్తున్నామని ప్రజలు అర్థం చేసుకుని సంపూర్ణ సహకారం అందించారన్నారు.

ఈ బంద్‌కు మద్దతు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ గుండాలు కలిసి కరీంనగర్ నగరంలో మరింత అశాంతి సృష్టించి శాంతిభద్రతల సమస్యను తీవ్రతరం చేస్తారనే విషయాన్ని ప్రజలు గమనించారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు “ఈ బంద్‌ను ఫెయిల్ చేస్తాం” అంటూ ముందుగానే ప్రకటనలు చేసినప్పటికీ, కరీంనగర్ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో తమ మద్దతును తెలియజేసి బంద్‌ను విజయవంతం చేశారన్నారు.

ఈ బంద్‌కు సంబంధించి ఉదయం నాలుగు గంటల నుంచే అనేక మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ , మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ , రసమయి బాలకిషన్ పాటు అనేక మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను అనవసరంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని అరెస్టులు చేసినా, ఎంతమందిని అడ్డుకున్నా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించి సంపూర్ణంగా సహకరించారన్నారు.