కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వర్‌రావుకు డాక్టరేట్ ప్రదానం
కరీంనగర్, జూలై 19 (విజయ క్రాంతి): కరీంనగర్ డెయిరీ చైర్మన్ సిహెచ్ రాజేశ్వర్ రావుకు అమెరికా మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆదివారం న్యూఢిల్లీలోని లోధిరోడ్లో ఉన్న ‘ఇండియా హ్యాబి టాబ్ సెంటర్ లోనిహుల్మోహర్లో జరిజిన్ కార్యక్రమంలో రాజేశ్వర్ రావు గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. పాల ఉత్పత్తి చేసే రైతుల సాధికారత, పాల విప్లవాన్ని ప్రారంభించడంలో ఆయన చేసిన విశేష సేవలకుగాను ఈ డాక్టరేట్ ప్రదానం చేశారు.
వ్యవసాయ పట్టభద్రులైన రాజేశ్వర్ రావు పాడి పరిశ్రమ రంగం లోనూ, రైతుల సాధికారత దిశగానూ అవిశ్రాంత కృషి చేశారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను అదనపు ఆదాయ వనరుగా చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
రాజేశ్వర్ రావు నాయకత్వంలో కరీంనగర్ డెయిరీ అద్భుతమైన వృద్ధిని సాధించి, పాలు, పాల ఉత్పత్తుల సేకరణ లాగే అమ్మకాల పరంగా తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. మార్కెట్ పరిధిని విస్తరించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి దోహదపడేలా అయన అనేక కొత్త ఉత్పత్తుల తయారీకి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం లక్ష మందికి పైగా రైతులు కరీంనగర్ డెయిరీ పాలను సరఫరా చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.






