కర్ణాటక–మహారాష్ట్ర పాదయాత్ర
భక్త బృందాలతో రెండో విడత సమన్వయ సమావేశం
నాగర్ కర్నూల్/శ్రీశైలం,(విజయక్రాంతి): ఉగాది మహోత్సవాల సందర్భంగా కర్ణాటక, మహారాష్టాలకు చెందిన పాదయాత్ర భక్తబృందాలతో రెండో విడత సమన్వయ సమావేశం ఆదివారం శ్రీశైల దేవస్థానం పరిపాలనా భవనంలో నిర్వహించారు. 19న జరగనున్న ఉగాది మహోత్సవాలు ఈ నెల 16 నుంచి 20 వరకు శ్రీశైలంలో ఘనంగా జరుగనున్నాయి. ఈ సమావేశంలో కర్ణాటకలోని బాగల్‌కోట్, బెళగావి, బీజాపూర్ (విజయపుర) జిల్లాలు, అలాగే మహారాష్ట్రలోని కోల్హాపూర్, షోలాపూర్, అక్కల్‌కోట్ ప్రాంతాలకు చెందిన సుమారు 63 పాదయాత్ర భక్తబృందాలు, స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉత్సవాల సందర్భంగా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై విస్తృతంగా చర్చించారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఇటీవల తేర్ దాళ్లోని అల్లమప్రభు దేవస్థానంలో నిర్వహించిన తొలి సమన్వయ సమావేశానికి భక్తబృందాలు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.




