calender_icon.png 5 November, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుగ్గలో కన్నుల పండుగగా కార్తీక వేడుకలు...!

05-11-2025 09:57:20 AM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవ స్థానంలో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు(Karthika Pournami celebrations ) కన్నుల పండుగగా జరిగాయి. ఉదయం 5 గంటల నుంచి భక్తులు బుగ్గ శివాలయానికి పోటెత్తారు. అశేషంగా తరలివచ్చిన భక్తులతో బుగ్గ ప్రాంతం సందడిగా మారింది. మహిళలు పెద్ద ఎత్తున కోనేటి స్నానాలు ఆచరించారు. దేవస్థానం ఎదురుగా గల శివలింగం, నందీశ్వర విగ్రహాల వద్ద మహిళలు భారీగా కార్తీక ఉసిరిక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాజరాజేశ్వరునికి పలు రకాల నైవేద్యాలను సమర్పించి ముక్కులు తీర్చుకున్నారు.శివ సత్తెల  పూనకాలతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది. దేవాదాయ శాఖ అధికారులు సులభ, ప్రత్యేక దర్శన సౌకర్యాలను కల్పించారు. అర్చకులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిపించారు. భక్తాంజనేయ, నాగులమ్మ దేవాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. అశేషంగా తరలివచ్చిన భక్త జనం కోసం దాతలు అన్నదాన ఏర్పాట్లు చేపడుతున్నారు. దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్, అన్నదాన ట్రస్ట్ చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు దంపతులు కార్తీక పౌర్ణమి ఏర్పాట్లను పర్యవేక్షించారు.