05-11-2025 11:28:49 AM
- మాజీ మేయర్ వై సునీల్ రావు
కరీంనగర్,(విజయక్రాంతి): రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసి బస్సు ప్రమాదాలపై( bus accidents) ప్రభుత్వం సమీక్ష సమావేశాలు నిర్వహించాలని బీజేపీ నాయకుడు, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ రాజీవ రహాదారి పై మంగళవారం తెల్లవారు జామున జరిగిన ఆర్టీసి బస్సు, ట్రాక్టర్ ను డీ కొన్న రోడ్డు ప్రమాద ఘటన తో పాటు చేవేళ్ళ లో జరిగిన ఆర్టీసి బస్సు, టిప్పర్ డీ కొన్న ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేవేళ్ళ రోడ్డు ప్రమాదంలో 20 మంది మృతి చెందడం, రేణికుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డ పట్ల విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి బస్సులకు జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాల పై ప్రజలు ఆంధోళన చెందుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్సు ప్రయాణికుల పట్ల చాలా జాగ్రత్తలు వహించి.... ఇలాంటి ప్రమాదాలకు అడ్డు కట్ట వేయాలని కోరారు. ప్రభుత్వం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి....ఆర్టీసి అధికారులు, సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్టీసి బస్సులు నడిపే డ్రైవర్లకు ప్రమాణ సమయంలో పాటించే జాగ్రత్త చర్యల పై వివరించాలని...డ్రైవింగ్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించేలా హెచ్చరికలు జారీ చేయాలని కోరారు. బస్సు ప్రమాదాల్లో చనిపోయిన, గాయపడిన వారిని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.