calender_icon.png 5 November, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆటో డ్రైవర్ ఆత్మహత్య

05-11-2025 11:24:59 AM

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్య..!

మల్కాజ్‌గిరి,(విజయక్రాంతి): మల్కాజ్‌గిరి పోలీస్‌ స్టేషన్‌(Malkajgiri Police Station) పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో పట్టుబడిన వ్యక్తి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దమ్మాయిగూడకు చెందిన సింగిరెడ్డి మీన్‌రెడ్డి (32) అనే యువకుడు ఇటీవల కుషాయిగూడ ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలలో పట్టుబడ్డాడు.

ఈ వ్యవహారంపై తీవ్ర మనస్తాపానికి గురైన మీన్‌రెడ్డి, మంగళవారం అర్ధరాత్రి సమయంలో మౌలాలి ప్రాంతంలోని కుషాయిగూడ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌(Kushaiguda Traffic Police Station) ఎదుటకు వచ్చి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న వారు ఆందోళనకు గురై వెంటనే సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయాలతో తడిసిముద్దైన మీన్‌రెడ్డిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మల్కాజ్‌గిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల విచారణలో పోలీసుల వ్యవహారం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.