06-02-2026 12:43:51 AM
పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రాణం పోయింది
మొయినాబాద్, ఫిబ్రవరి, ౫ (విజయక్రాంతి): మండలం కేతిరెడ్డిపల్లిలో దారుణ హత్యకు గురైన యువ న్యాయవాది స్వప్న కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. గురువారం కేతిరెడ్డిపల్లి చేరుకున్న ఆమె, స్వప్న చిత్రపటానికి నివాళులర్పించి, కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులను ఓదార్చి పోలీసుల వైఫల్యంపై ఆగ్రహంవ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె తన ప్రాణాలకు ముప్పు ఉందని స్వప్న పదేపదే మొరపెట్టుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. ఖాకీలు సకాలంలో స్పందించి ఉంటే ఈ రోజు స్వప్న మన మధ్య ఉండేది‘ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న ’అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్’ బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. గన్ కల్చ్ప విమర్శలు హైదరాబాద్ శివారులో గన్ కల్చర్ పెరిగిపోతోందని, నేరగాళ్లకు పోలీసులంటే భయం లేకుండా పోయిందని మండిపడ్డారు.
ప్రభుత్వానికి డిమాండ్లు
ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కవిత పలు సూచనలు చేశారు. స్వప్న కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని, మూడు నెలల్లోపు విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రధాన శాఖలు అయినా మున్సిపల్, హోం, విద్య వంటి కీలక శాఖలపై సీఎం దృష్టి సారించి పాలనను చక్కదిద్దాల ని సూచించారు.
పాలన గాలికి వదిలేశారు. గురుకుల విద్యార్థులు పాముకాట్లకు గురవుతున్నా, అగ్నిప్రమాదాలు జరుగుతున్నా బాధితుల ను సీఎం పరామర్శించకపోవడం విచారకరం. ఇప్పటికైనా నేరాలను అదుపు చేయాలి‘ అని కవిత హితవు పలికారు. స్వప్న కుటుంబానికి తమ పార్టీ మరియు తెలంగాణ జాగృతి అన్ని విధాలా అండగా ఉంటానని ఆమె ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.