19-02-2026 01:53:30 PM
హైదరాబాద్: కల్వకుంట్ల కవిత(Kavitha Kalvakuntla) కొత్త పార్టీకి ముహూర్తం ఖరారైంది. కవిత గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మే మొదటి వారంలో ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందన్నారు. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చన్నారు. సిద్దిపేట, బోధన్, రెండింట్లో ఒక చోటు పోటీ చేస్తానని కవిత స్పష్టం చేశారు. మొదటి చాయిస్ సిద్దిపేట, రెండో చాయిస్ బోధన్ అన్నారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉండవని కవిత పేర్కొన్నారు. పార్టీ పెట్టాక తెలంగాణలో తాము ప్రధాన ప్రతిపక్షం అవుతామన్నారు.
ఎన్నికల్లో గెలిచి వందశాతం అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్త ంచేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వస్తే ఏదో ఒక పార్టీ గుర్తుపై పోటీ చేస్తామని సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు పార్టీ ఏర్పాటు పూర్తియితే తమ పార్టీ గుర్తుపై పోటీ చేస్తామని తెలిపారు. తమ పార్టీలో యువత, కొత్త వారికి పెద్దపీట వేస్తామని సూచించారు. బీఆర్ఎస్ లో ఉన్నవారు చాలామంది తనతో టచ్ లో ఉన్నారని కవిత వివరించారు. ఎవరు టచ్ లో ఉన్నారో సందర్భం వచ్చినప్పుడు చెబుతా అన్నారు. షర్మిలతో తనను పోలుస్తూ మాట్లాడడం తగదని హెచ్చరించారు. షర్మిల.. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారని తెలిపారు. పార్టీలు పెట్టిన మగవారిపై ఎందుకు చర్చించరు.. ఆడవాళ్లనే ఎందుకు ప్రస్తావిస్తారు?, చిరంజీవి పార్టీ గురించి ఎందుకు మాట్లాడరు? అని కవిత ప్రశ్నించారు.