26 June, 2026 | 4:44 PM

అసదుద్దీన్ వ్యాఖ్యలకు రామచందర్ రావు కౌంటర్

26-06-2026 03:38 PM

పాస్ పోర్టు ఒక ట్రావెల్ డాక్యుంట్

హైదరాబాద్: రాష్ట్రంపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టిందని తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు(Telangana BJP President Ramchander Rao) తెలిపారు. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ జూన్ 28 నుండి జూన్ 30 వరకు తెలంగాణలో మూడు రోజుల పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను రాంచందర్ రావు మీడియా సమక్షంలో వెల్లడించారు. జూన్ 28న, ఆయన రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అదే వేదిక నుండి మరో 9 జిల్లాల బీజేపీ కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఆ రోజు సాయంత్రం నాంపల్లి గ్రౌండ్స్‌లో జరిగే బీజేపీ బూత్ అధ్యక్షుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం ఆయన నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని సందర్శించి, రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమవుతారు.

జూన్ 29న, నితిన్ నబిన్ VBITలో జరిగే 'వికసిత్ భారత్ యువ సంవాద్' కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత వరంగల్‌కు వెళ్లి గిరిజన వర్గాల సమావేశంలోనూ, అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలోనూ పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి బస కోసం ఆయన తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. జూన్ 30న, ఘట్‌కేసర్‌లో జరిగే బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరై ప్రసంగిస్తారు, ఆ తర్వాత న్యూఢిల్లీకి బయలుదేరుతారని బీజేపీ చీఫ్ రామచందర్ రావు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే మూడు రాష్ట్రాల నీటి సమస్య పరిష్కారం అయిందని స్పష్టం చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించిన విషయాలు బయటపెట్టాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు. ప్రజలకు వాస్తవాలు వివరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

అసదుద్దీన్ వ్యాఖ్యలకు రాంచందర్ రావు కౌంటర్

పాస్ పోర్టుపై అసదుద్దీన్(Asaduddin Owaisi) వ్యాఖ్యలకు రామచందర్ రావు కౌంటర్ ఇచ్చారు. పాస్ పోర్టు అనేది ఒక ట్రావెల్ డాక్యుమెంట్ అని రామచందర్ రావు వెల్లడించారు. ఇదే విషయాన్ని గతంలో బాంబే హైకోర్టు తేల్చిచెప్పిందని సూచించారు. పాస్ పోర్టు పౌరసత్వానికి ప్రామాణికం కాదని క్లారిటీ ఇచ్చిందని చెప్పారు. ఇదే విషయాన్ని విదేశాంగ శాఖ వెల్లడిస్తే రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.