ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర సంపద సీమాంధ్రలకు మళ్లించిండు కేసీఆర్..
- విద్య వైద్యాన్ని గత ప్రభుత్వమే గాలికి వదిలేసింది
రాష్ట్ర రాజకీయాలలో నల్లగొండ జిల్లా టైగర్ జోన్
బడ్జెట్లో 1015 శాతం విద్యకు కేటాయించాలి
సాంకేతిక వనరులతో సమగ్ర విద్యా ప్రయాణం
భవిష్యత్ లక్ష్యాలకు బలమైన పునాది ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణమే అభివృద్ధికి తొలి అడుగు
విద్యకు ప్రాధాన్యతను ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
మునుగోడు, మార్చి 1 (విజయక్రాంతి): గత ప్రభుత్వం పదేళ్లపాటు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, విద్యావైద్య రంగాలను పూర్తిగా గాలికి వదిలేసిందని, ప్రాజెక్టుల పేరుతో కమిషన్లకు కక్కుర్తి పడి రాష్ట్ర సంపదను సీమాంధ్రలకు మళ్లించిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
కులమతాలకు అతీతంగా సమగ్ర విద్య అందించాలనే లక్ష్యంతో మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని దుబ్బకాలువ రోడ్డులో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం,నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, టీజీఈడబ్ల్యూఐడీసీ ఎండీ గణపతి రెడ్డి పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు.
మునుగోడు నియోజకవర్గంలో 2500 మంది విద్యార్థుల కోసం రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం శుభపరిణామమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 79 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభమవుతున్నాయని, వీటిలో సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు చదువుకోనున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా భారీ ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో కనీస వసతులు కల్పించకుండా ప్రజలను కార్పొరేట్ రంగంపై ఆధారపడే పరిస్థితి తీసుకొచ్చారని పేర్కొన్నారు.ప్రస్తుత ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉందని, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసి పేదలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు.
మేం చిన్ననాడు చదువుకునేటప్పుడు బడిలో కులాల గురించి తెలియదు. అన్ని కులాలు, అన్ని మతాలవారు ఒకే ప్రాంగణంలో చదువుకునేవాళ్లం. ఇప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కూడా అలాంటి సమగ్ర విద్యా వాతావరణాన్ని తీసుకొస్తాయి అని అన్నారు. గత ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను గాలికి వదిలేసిందని విమర్శించారు. కొంతమందికి బర్లు, గొర్లు, చేప పిల్లలు ఇచ్చారు కానీ నాణ్యమైన విద్య అందించలేదు. విద్య పూర్తిగా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోయింది అన్నారు.
తెలంగాణలో 76 లక్షల 35 వేల 115 మంది విద్యా ర్థులు చదువుతున్నారని, అందులో 44 లక్షల మంది ప్రైవేట్ రంగంలో, 24 లక్షల మంది ప్రభుత్వ రంగంలో ఉన్నారని తెలిపారు. కనీసం 50 లక్షల మంది ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివేలా చేయాలంటే బడ్జెట్లో 1015 శాతం విద్యకు కేటాయించాలని సూచించారు. మునుగోడు నియోజక వర్గంలో 330 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ కేవలం 9,700 మంది విద్యార్థులే చదు వుతున్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్కు సమీపంలో ఉన్నా మునుగోడు అభివృద్ధిలో వెనుకబడి ఉంది. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణమే అభివృద్ధికి తొలి అడుగు అన్నారు.నల్గొండ జిల్లా రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన టైగర్ జోన్ అని పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
మద్దతు ఉన్నా.. ప్రజా అంశాల్లో రాజీ లేదు: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే ప్రతిపక్ష ధోరణిలో ఉండి, ప్రజా ప్రయోజనాల అంశాల్లో ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తామని ఎమ్మెల్సీ నెల్లికంటే సత్యం స్పష్టం చేశారు.అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా అమలవ్వాలని, విద్యావైద్య రంగాలకు తగిన నిధులు కేటాయించాలని, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను బలోపేతం చేయాలని కమ్యూనిస్టు పార్టీ తరఫున నిరంతరం డిమాండ్ చేస్తామని తెలిపారు.ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వంపై అవసరమైనప్పుడు నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ అభివృద్ధికి సహకరిస్తామని పేర్కొన్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి అభినందనలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారని అన్నారు. కార్పొరేట్ శక్తులు విద్యను వ్యాపారంగా మార్చిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ప్రారంభం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, చండూర్ ఆర్డీవో శ్రీదేవి, మునుగోడు ఇన్చార్జ్ తాసిల్దార్ నేలపట్ల నరేష్, ఎంపీడీవో యుగేందర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు,చండూర్ చౌటుప్పల్ మున్సిపాలిటీల చైర్మన్, కౌన్సిలర్లు, మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్, నియోజకవర్గంలోని అన్ని మండలాల సర్పంచులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు.




