కేసీఆర్ కనుసన్నల్లోనే కాంగ్రెస్‌లోకి
బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): కేసీఆర్ కనుసన్నల్లోనే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, కుంభకోణాల నుంచి భయట పడేందుకు ఎమ్మెల్యేల ఫిరాయింపు ల పర్వాన్ని మొదలుపెట్టారని విమర్శించారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. మంగళవారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ప్రభాకర్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమా ణం చేసి ఆరు నెలలు గడిచినా పాలనపై పట్టుసాధించలేకపోయారని ఎద్దేవాచేశారు.
పాలనలో పట్టు నిలుపు కోవడానికే మూకుమ్మడిగా ఐఏ ఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. పాలనను గాడి లో పెట్టేందుకు రేవంత్‌రెడ్డి కిందామీదా పడుతున్నారని విమర్శించా రు. ఢిల్లీ పెద్దల మెప్పు పొంది, సీఎం పదవిని కాపాడుకోవడంపైనే రేవంత్ దృష్టి పెట్టారని, ప్రజాపాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు. ఆరు నెలలు గడిచినా మంత్రివర్గ విస్తరణతోపాటు కార్పొరేషన్ల నియామకాలు చేయలేకపోవడం రేవంత్ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ల నియామకాలు, రాజకీయ ప్రచారం, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక చేసుకునేందుకే రేవంత్ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రయత్నాల్లోనే 11 సార్లు ఢిల్లీ వెళ్లారని మండిపడ్డారు. ఢిల్లీలోనే క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేసు కొని అక్కడి నుంచే పాలన చేసుకోవాలంటూ చురకలు అంటించా రు.






