30 July, 2026 | 8:42 PM

బయటకొస్తున్న కేసీఆర్ కుటుంబ బాగోతాలు

29-05-2024 12:59 AM

విదేశాల్లో ఉన్న ప్రభాకర్‌రావు వస్తే మరింత పురోగతి

ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి 

హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబం బాగోతం ఒక్కొక్కటి బయటికి వస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతల ఫోన్లను ట్యాపింగ్  చేసిన చరిత్ర బీఆర్‌ఎస్ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఎమ్మెల్యే వంశీకృష్ణ తో కలిసి ఆయన మాట్లాడారు. విదేశాల నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలను దిగుమతి చేశారని, వాటిలో బీఆర్‌ఎస్  ఎమ్మెల్యేలు పెట్టబడి పెట్టినట్టు సమాచారం ఉందని చెప్పారు.

విదేశాల్లో ఉన్న ప్రభాకర్‌రావును స్వదేశానికి రాకుండా బీఆర్‌ఎస్ నేతలే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రభాకర్‌రావు హైదరాబా ద్‌కు వచ్చి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత పురోగతి ఉంటుందని పేర్కొన్నారు. ఎప్పుడూ అధికారంలో ఉండాలనే దుర్బిద్ధితో వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని, తన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని డీజీపీకి మొదట ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ మజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రొద్బలంతోనే తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. బాలరాజుపై చర్యలు తీసుకోవాలని డీజీపీ, ఐజీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన దోషులను శిక్షించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతామని చెప్పారు.