తెలంగాణపై అందెశ్రీకే పూర్తి స్వేచ్ఛ
‘స్వేరోస్’తో దొంగలను పోషించారు
వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు
హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పాటను ఎవరితో కంపోజ్ చేయాలనే దానిపై సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి స్వేచ్ఛను అందేశ్రీకి ఇచ్చారని వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. సమంత, గోపీచంద్, మంచు లక్ష్మివంటి వాళ్లకు కేసీఆర్ అవకాశాలు ఇచ్చినప్పుడు వాళ్లు ఆంధ్రోళ్లని గుర్తు లేదా? అని ప్రశ్నించారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంటర్నేషనల్ అవార్డు విన్నర్ అనే విషయం గుర్తుంచుకోవాలని హితవుపలికారు.
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ గుండు చేయించుకున్నంత మాత్రాన బుద్దిస్ట్, అంబేద్కర్ కాలేడని దుయ్యబట్టారు. ఏనుగు ఎక్కి ప్రగతిభవన్ పోతానన్న ప్రవీణ్ ఎక్కడికి పోయిండు? ఏనుగు ఎక్కడికి పోయింది? ప్రవీణ్ బీఆర్‌ఎస్‌లో చేరక ముందు నుంచీ కేసీఆర్ బాణమే? కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన పదేళ్లు ఒకే పోస్టులో ఉన్నాడు? ఆయనను ఎవరూ నమ్మవద్దని పేర్కొన్నారు. స్వేరోస్ అనే సంస్థను పెట్టి దొంగలను పోషించారని మండిపడ్డారు.






