జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్ లేఖ
హైదరాబాద్: జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ ఇచ్చారు. విద్యుత్ కొనుగోలు విషయంలో కమిషన్ కు కేసీఆర్ 12 పేజీల లేఖ రాశారు. అన్ని రకాల చట్టాల నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని కేసీఆర్ వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర అనుమతులు సాధిప్తూ ముందుకెళ్లామన్నారు. ఈఆర్ సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదని కేసీఆర్ స్పష్టం చేశారు. కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియదా? కేసీఆర్ ప్రశ్నించారు. కమిషన్ చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విరుద్ధమన్నారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. రాజకీయ కక్షతో నన్ను, అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేయడానికే కమిషన్ వేసినట్లు ఆరోపించారు.
రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ రంగం సంక్లిష్ట పరిస్థితులో ఉందని కేసీఆర్ తెలిపారు. కరెంట్ సరిగా లేక లక్షలాదిగా వ్యవసాయ పంపుసెట్లు కాలిపోయిన పరిస్థితి ఉందన్నారు. పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలోకొన్ని రోజులు పవర్ హాలిడే ప్రకటించారని గుర్తుచేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంట్ ఏమాత్రం సరిపోలేదని తెలిపారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ పటిష్ఠానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నామని చెప్పారు. అన్ని రకాల అనుమతులు పొంది ముందుకు పురోగమించడం జరిగిందని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం గణనీయ మార్పుతో కరెంట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందేనని కేసీఆర్ పేర్కొన్నారు. మా మార్పును తక్కువ చూపించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. విచారణ అనేది ఒక పవిత్ర బాధ్యత అన్నారు. ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిగా నిలిచి నిజాలు నిగ్గుతేల్చాలని కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు వెల్లడించాలన్నారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలని మాట్లాడుతున్నట్లుందన్నారు. ఇప్పటికే నష్టం జరిగినట్లు.. ఆర్థిక నష్టాన్ని లెక్కిస్తున్నట్లు మీ మాటలు ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించట్లేదన్న కేసీఆర్ నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదన్నారు. తాము చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుని వైదొలిగితే మంచిదని కేసీఆర్ సూచించారు. మీరు కమిషన్ బాధ్యతల నుంచి వైదొలగాలని వినయపూర్వకంగా కోరుతున్నానని కేసీఆర్ స్పష్టం చేశారు.






