కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం(Telangana Formation Day) సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతియుతంగా పార్లమెంటరీ పంథాలో కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఆగమైన తెలంగాణను స్వయం పాలనలో అభివృద్ధి చేసుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. సకల జనుల సంక్షేమాన్ని కొనసాగిస్తూ, సమస్త రంగాల్లో ప్రగతిని సాధిస్తూ, పదేండ్ల అనతికాలంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుకున్నామని కేసీఆర్ వివరించారు. అదే స్పూర్థిని కొనసాగిస్తూ, అన్ని వర్గాల ప్రజల జీవన విధానం మరింత గుణాత్మకంగా సాగే దిశగా పాలనా ప్రాధాన్యతలను ఎంచుకొని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్(KCR) సూచించారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం నింపాలని స్పష్టం చేశారు.
తెలంగాణ మరింత ప్రగతిని సాధిస్తూ, పాడి పంటలతో వర్థిల్లుతూ, రైతులు సబ్బండ కులాలు, సకలజనుల జీవితాలు సుఖ సంతోషాలతో నిండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. పూర్వ ఆంధ్రప్రదేశ్ పాలనలో నిర్లక్ష్యం చేయబడిన తెలంగాణ, రాష్ట్ర ఏర్పాటు తర్వాత సమ్మిళిత అభివృద్ధి, అద్భుతమైన సంక్షేమాన్ని సాధించిందని చంద్రశేఖర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ప్రజా కేంద్రీకృత విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చాలని, ప్రజల విశ్వాసాన్ని పెంచాలని ఆయన సూచించారు. తెలంగాణ వ్యవసాయం, పాడి పరిశ్రమలో అభివృద్ధి చెందుతూనే ఉంటుందని, సమాజంలోని అన్ని వర్గాలలో శ్రేయస్సును నిర్ధారిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.






