11-12-2025 09:04:24 AM
తిరువనంతపురం: కేరళలో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశ పోలింగ్(Kerala local bodies polls) గురువారం ఉదయం ఏడు జిల్లాల్లో ప్రారంభమైంది. త్రిస్సూర్, పాలక్కాడ్, కోజికోడ్, మలప్పురం, వయనాడ్, కన్నూర్, కాసరగోడ్ జిల్లాల్లోని 18,274 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 గంటల నుండి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం బారులు తీరారు. పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. వచ్చే ఏడాది జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలను చాలామంది ఒక కీలక సూచికగా భావిస్తున్నారు.
రెండో దశలో, గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలు, జిల్లా పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో సహా 604 స్థానిక సంస్థలలోని 12,931 వార్డులకు 1.53 కోట్లకు పైగా ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. మొత్తం 38,994 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రంలోని తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుళా, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లో డిసెంబర్ 9న ముగిసిన తొలి దశ పోలింగ్ దాదాపు 70 శాతం పోలింగ్ నమోదైంది. రెండు దశల పోలింగ్ ఫలితాలు డిసెంబర్ 13న వెల్లడవుతాయి.