విమానంలా కేరళం బస్సు!

09-09-2026 | 05:20am
  1. బస్సులో హోస్టెస్ సేవలు, అల్పాహారం, బాత్‌రూమ్

కేఎస్‌ఆర్టీసీ హైటెక్ సౌకర్యాల వీడియో వైరల్

తిరువనంతపురం, సెప్టెంబర్ 8: విమానంలో లభించే సౌకర్యాలను తలపించేలా కేరళం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్‌టీసీ) (Kerala State Road Transport Corporation) కొత్త ప్రీమియం బస్సు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరువనంతపురం మార్గంలో నడిచే ఈ ‘బిజినెస్ క్లాస్’ బస్సు సర్వీస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ బస్సులో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు.

లెదర్ రీక్లైనర్ సీట్లు, ప్రతి ప్రయాణికుడికి వ్యక్తిగత స్క్రీన్లు, ఉచిత వైఫై, చార్జింగ్ పోర్టులు వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా బస్సులోనే అంతర్గత బాత్‌రూమ్‌ను కూడా కల్పించారు. ప్రయాణికులకు ఆహారం అందించేందుకు హోస్టెస్ సేవలను కూడా అందుబాటు లోకి తీసుకొచ్చారు. దీంతో సాధారణ ఆర్టీసీ బస్సు ప్రయాణానికి భిన్నంగా విమాన ప్రయాణ అనుభూతిని కల్పించేలా ఈ సర్వీరస్‌ను తీర్చిదిద్దారు.

తిరువనంతపురం నుంచి ఎర్నాకులం వరకు 200 కి.మీ. దూరం ప్రయాణానికి రూ.505 ధర నిర్ణయించారు. బస్సు లోపలి సౌకర్యాలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వీడియో చూసిన నెటిజన్లు బస్సు ఇంటీరియర్స్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇది నిజంగా ఆర్టీసీ బస్సేనా?, బస్సా.. విమానమా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎయిర్ బస్సులో సేవలు (విమానం) బస్సులో అందుతుండడంపై పలువురు నెటీజన్లతోపాటు, ప్రముఖులు కూడా కేరళ ఆర్టీసీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు