22-11-2025 01:03:00 PM
హైదరాబాద్: సుప్రీంకోర్టు త్వరిత విచారణకు ఆదేశించిన తర్వాత తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు తీవ్రరూపం దాల్చింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం, దానంకు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం కడియం శ్రీహరి మరింత సమయం కావాలని స్పీకర్ ను కోరగా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన స్పందనను సిద్ధం చేస్తున్న సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుతో వివరణాత్మక సమావేశం నిర్వహించారు. దానం స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కూడా కలిసే అవకాశముంది. అనర్హత నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు దానం మరికొంత సమయం కోరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ పెద్దలతో దానం నాగేందర్ సంప్రదింపులు జరిపారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా రాజీనామా, ఇతర అంశాలపై ఏఐసీసీ పెద్దలతో చర్చించారు. తాను రాజీనామా చేస్తే తిరిగి తనకే సీటు ఇవ్వాలని దానం ఏఐసీసీని కోరారు. అనర్హత వేటు వేసేందుకు అవకాశం ఉంటే రాజీనామా చేస్తానని సన్నిహితులకు దానం చెప్పారు.